అక్రమాలు, నిధుల దుర్వినియోగం: టీటీడీ, ఎస్వీబీసీ ప్రభుత్వానికి హైకో కోర్టు నోటీసులు
హైదరాబాద్/తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) వ్యవహారంపై తీవ్రంగా స్పందించింది. లీజు ముగిసినా టెండర్లను ఎందుకు కొనసాగిస్తున్నారని, వీలైనంత త్వరగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని టీటీడీని మంగళవారం హైకోర్టు ఆదేశించింది.
బిల్లులు ఇవ్వకుండా, నిబంధనలకు విరుద్ధంగా హోటళ్లు నిర్వహిస్తున్న వారిపై చర్యల వివరాలను సమర్పించాలని స్పష్టం చేసింది. దేవుడి భయం వారిలో లేకుండా పోయిందని పేర్కొంది. కాగా, తిరుమలలోని హోటళ్లను నియంత్రించేలా ఆదేశాలివ్వాలంటూ చిత్తూరుకు చెందిన పరిహార సేవా సమితి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టు ఈ మేరకు స్పందించింది.

చర్యలు తీసుకుంటున్నాం
ఈ వ్యాజ్యంపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ కె విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం మరోసారి విచారించింది. లీజు బకాయిలు వసూలు కావాల్సి ఉన్నందున గడువు పొడగించామని, టెండర్ల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ తరపు న్యాయవాది శివరాజు శ్రీనివాస్ కోర్టుకు తెలిపారు.
Recommended Video


వారిని దారిలో పెట్టండి
ఫిర్యాదులు స్వీకరణకు, వాటి పరిష్కారంపై తెలుసుకోవడానికి వీలుగా యాప్ రూపకల్పన దాదాపు పూర్తయిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. వినియోగదారులు బిల్లులు పొందేలా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తామనగా.. హైకోర్టు ధర్మాసనం జోక్యం చేసుకుంటూ భక్తులను చైతన్యపర్చడం కంటే ముందు వాణిజ్య పన్నుల శాఖ దాడులు నిర్వహిస్తే వ్యాపారులు దారిలోకి వస్తారని స్పష్టం చేసింది. బిల్లులివ్వని హోటళ్లపై చర్యల వివరాలను సమర్పించాలని ఆదేశించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

నిధుల దుర్వినియోగంపై హైకోర్టు నోటీసులు
ఇది ఇలా ఉండగా, శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్(ఎస్వీబీసీ)లో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై టీటీడీ, ప్రభుత్వంతోపాటు ఛానల్‌కు సోమవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎస్వీబీసీ సీఈఓ ఎంవీ నరసింహారావు అక్రమాలకు పాల్పడుతున్నారని, నిధులు దుర్వినియోగమవుతున్నా.. టీటీడీ, ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని.. చర్యలకు ఆదేశించాలంటూ తిరుపతికి చెందిన పీ నవీన్ కుమార్ రెడ్డి ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ కె విజయలక్ష్మీలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

2.20కోట్లంటే తక్కువ మొత్తమా?
ఎస్వీబీసీ సీఈఓ తరపు న్యాయవాది సురేందర్ రావు వాదనలు వినిపిస్తూ రూ. 4.40కోట్లు దుర్వినియోగమయ్యాయన్న పిటిషనర్ ఆరోపణలు అవాస్తవమని, ఓ కార్యక్రమం కోసం వెచ్చించిన రూ.2.20కోట్ల గురించి విజిలెన్స్ నివేదిక ప్రస్తావించిందని అన్నారు. టీటీడీ తరపు న్యాయవాది జయప్రకాశ్ బాబు స్పందిస్తూ.. ఎస్వీబీసీ ఛానల్ సీఈఓ నరసింహారావు పదవీ కాలం మూడు నెలల క్రితమే ముగిసిందని, కొనసాగింపుపై పాలకమండలి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే మెమో ఇచ్చారని చెప్పారు. వాదనలు పూర్తిగా విన్న ధర్మాసనం.. రూ.2.20కోట్లు చిన్న మొత్తమేమీ కాదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని టీటీడీని ఆదేశించింది. దీనిపై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications