రఘురామ పంచెకట్టు-జనసేన ఎమ్మెల్యే చీర-అసెంబ్లీలో ఆసక్తికర చర్చ..!
ఏపీ అసెంబ్లీలో ఇవాళ ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తాజాగా డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు.. అసెంబ్లీలో చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ముఖ్యంగా సభ్యులతో కలిసి పోయి ఛలోక్తులు విసురుతున్నారు. వారిలో ఒకరిగా కలిసిపోయి రఘురామ చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.ఇదే క్రమంలో ఇవాళ అలాంటిదే మరో ఘటన జరిగింది.
రాష్ట్రంలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రశ్నోత్తరాల సమయంలో నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ప్రస్తావించారు. ముందుగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును ఉద్దేశించి మాధవి.. చక్కటి పంచెకట్టులో డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన రోజు నేతన్నలకు సంఘీభావం తెలిపారంటూ ప్రశంసించారు. అనంతరం చేనేత రంగం పలు సమస్యలు ఎదుర్కుంటోందని, ముఖ్యంగా నేతన్నలు మార్కెటింగ్ విషయంలో వెనుకబడుతున్నారని, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జనసేన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి కోరారు.

ఇలా ఎమ్మెల్యే మాధవి సుదీర్ఘంగా చేనేత రంగంపై సమస్యలు ప్రస్తావిస్తుండగా.. అడ్డుకున్న డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ఇది ప్రశ్నోత్తరాల సమయం కాబట్టి సుదీర్ఘ చర్చ అవసరం లేదన్నారు. నేరుగా మీ ప్రశ్న ప్రభుత్వానికి వేయాలని సూచించారు. దీంతో నాగ మాధవి ప్రభుత్వానికి పలు సూచనలు చేసి చర్చను ముగించారు. దీంతో అప్పటివరకూ ఈ చర్చను వింటున్న డిప్యూటీ స్పీకర్ రఘురామ.. మీరు వేసుకున్నది చేనేత చీరేనా అని ఆమెను ప్రశ్నించారు. దీంతో మాధవి కూడా అవునంటూ సమాధానం ఇచ్చారు. దీంతో సభలో నవ్వులు విరిశాయి.












Click it and Unblock the Notifications