వైసీపీకి మూడు ఎంపీ సీట్లే ? ఆ సర్వే రిపోర్ట్ ఫేక్ అంటున్న ఐప్యాక్..!
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ సర్వే రిపోర్టులు హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే పలు జాతీయ మీడియా ఛానళ్ల పేరుతో సర్వేలు వెలువడుతున్నాయి. వీటిలో కొన్ని వైసీపీకి, మరికొన్ని టీడీపీకి మద్దతుగా ఉంటున్నాయి. దీంతో అసలే గందరగోళంలో ఉన్న ఓటర్లకు తాజాగా అధికార వైసీపీకి వ్యూహకర్తగా ఉన్న ఐప్యాక్ సంస్ధ పేరుతో మరో సర్వే రిపోర్ట్ మీడియాలో సంచలనం రేపింది. టీడీపీకి అనుకూలంగా ఉండే కొన్ని మీడియా ఛానళ్లలో దర్శనమిచ్చిన ఈ రిపోర్ట్ వైసీపీకి ఈసారి మూడు ఎంపీ సీట్లే వస్తాయని తెలిపింది. ఈ తాజా సర్వే నివేదికను ఐప్యాక్ సంస్ధ వైసీపీకి అందించినట్లు ఈ కథనాల సారాంశం.

దీనిపై ఐప్యాక్ సంస్ధ అధికారికంగా ట్విట్టర్ ద్వారా స్పందించింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఓ మీడియా ఛానెల్ ఐ-ప్యాక్ కు లింక్ చేస్తూ ఫేక్ సర్వేను షేర్ చేసిందని, రికార్డును సరిగ్గా సెట్ చేద్దామని, ఐప్యాక్ ఎలాంటి సర్వేలను నిర్వహించదని పేర్కొంది. మీడియా/సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తమకు ఆపాదించబడిన ఏదైనా సర్వే పూర్తిగా అవాస్తవమని తెలిపింది. ఇవి నిర్దిష్ట వ్యక్తులు లేదా సమూహాలచే నిరాధారమైన తీరని ప్రయత్నాలని ఆరోపించింది. తప్పుదారి పట్టించకండి! అంటూ సూచించింది.

ఇంతకీ ఐప్యాక్ ఇచ్చిందంటూ ప్రచారం చేస్తున్న ఆ సర్వే రిపోర్టులో ఏం ఉందో తెలుసా ? వైసీపీకి మూడు ఎంపీ సీట్లలోనే స్పష్టమైన ఆధిక్యం ఉందట. అవి అరకు, కడప, రాజంపేట అని పేర్కొన్నారు. అలాగే మరో మూడు, నాలుగు సీట్లలో హోరాహోరీ కొనసాగుందన్నారు. మిగిలిన 15పైగా సీట్లలో టీడీపీకి స్పష్టమైన ఆధిక్యం ఉందని వైసీపీ పెద్దలకు ఐప్యాక్ సర్వే రిపోర్ట్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సర్వేను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో నిన్న ప్రసారం చేసినట్లు తెలుస్తోంది.
A media channel in Andhra Pradesh has shared a fake survey linking it to I-PAC.
— I-PAC (@IndianPAC) August 31, 2023
Let's set the record straight: I-PAC does NOT conduct any surveys.
Any survey attributed to us on media/social media platforms is entirely untrue. These are baseless and desperate attempts by…
వాస్తవానికి రాష్ట్రంలోని 25 ఎంపీ సీట్లలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ దాదాపు అన్నీ గెల్చుకునే అవకాసం ఉందని టైమ్స్ నౌ రిపోర్ట్ ఇచ్చింది. అలాగే టీడీపీ వచ్చే ఎన్నికల్లో 15 సీట్లకు పైగా గెల్చుకుంటుందని ఇండియాటుడే సర్వేలో తేలింది. ఈ రెండు రిపోర్టులపైనే రాష్ట్రంలో తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఐప్యాక్ పేరుతో వచ్చిన రిపోర్ట్ అన్ని పార్టీల్లోనూ చర్చకు కారణమైంది. దీంతో ఐప్యాక్ స్పందించి దీనిపై వివరణ ఇచ్చింది.












Click it and Unblock the Notifications