పొన్నాల ఎఫెక్ట్: టిడిపివైపు కొండా సురేఖ, కాదని క్లారిఫై

వచ్చే ఎన్నికల్లో టిడిపి తరఫున ఎన్నికల బరిలో నిలబడాలనే యోచనలో ఉన్నట్లుగా కనిపిస్తోందని ప్రచారం సాగుతోంది. టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో మంతనాలు కూడా జరుపుతున్నారని వినికిడి. చంద్రబాబు కొండా దంపతులను పార్టీలో చేర్చుకునే విషయంలో జిల్లా టిడిపి నేతలతో సూత్రప్రాయంగా చర్చించారట.
జెడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికలతో పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నేపథ్యంలో పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా బాబు బీజీగా ఉండడంతో కొండా దంపతుల చేరికపై ఇంకా పూర్తిగా దృష్టి సారించలేదంటున్నారు. పరకాలతో పాటు మరో అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన బరిలో దిగేందుకు టికెట్ల కోసం ఈ ఇద్దరు గత కొద్ది రోజులుగా ఢిల్లీ స్థాయిలో విఫలయత్నం చేశారట.
దీనికి తోడు అనూహ్యంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య నియమితులు కావడం వారు జీర్ణించుకోలేకపోతున్నారట. దీంతో తమ రాజకీయ భవిష్యత్తు కోసం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారంటున్నారు. గతంలో బిజెపితోను చర్చించినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా టిడిపి వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారట.
1999, 2004లో శాయంపేట నుంచి, నియోజకవర్గాల పునర్విభజన ఫలితంగా శాయంపేట కనుమరుగు కావడంతో 2009లో పరకాల నుంచి సురేఖ పోటీ చేసి వరుసగా మూడుసార్లు విజయం సాధించారు. మురళీ డిసిసిబి చైర్మెన్‌గా, ఎమ్మెల్సీగా పని చేశారు.
లోకసభ, అసెంబ్లీకి ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగి, పరకాల నుంచి తిరిగి పోటీ చేసే పరిస్థితి లేకపోవడంతో ప్రత్నామ్నాయంగా టిడిపి వైపు చూస్తున్నారని అంటున్నారు. ఆ పార్టీలో చేరినందుకు పరకాలతో పాటు వరంగల్ పశ్చిమ స్థానాల నుంచి టికెట్లను అశిస్తున్నట్టు తెలుస్తోంది. వారు టిడిపిలో చేరే విషయమై రెండు మూడు రోజుల్లో క్లారిటీ రానుందంటున్నారు.
కాగా, కొండా దంపతులు టిడిపి వైపు చూస్తున్నారనే వార్తల నేపథ్యంలో వారితో కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చలు చేపట్టినట్లుగా సమాచారం. కాంగ్రెస్‌ను వీడవద్దని జిల్లా నేతలు కొండా దంపతులకు సూచించినట్లు తెలుస్తోంది.
తనకు అన్ని పార్టీల నుండి ఆహ్వానం ఉందని, కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా పరకాల నుండే పోటీ చేస్తానని, టిడిపిలో చేరుతానన్న వార్తలు అవాస్తవమని కొండా సురేఖ అన్నారు.












Click it and Unblock the Notifications