రాజధానికీ, పెట్టుబడులకూ లింక్ లేదా ? మంత్రి వేణు కామెంట్స్ పై చర్చ ! అసలు నిజం ఇదే !
ఏపీలో పెట్టుబడులకూ, రాజధానికీ లింక్ లేదంటూ సమాచారమంత్రి వేణుగోపాలకృష్ణ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో కొత్త చర్చకు తెరదీస్తున్నాయి.
ఏపీలో రాజధాని ఏదో తేలకపోవడం వల్ల పెట్టుబడులు రావడం లేదన్న చర్చ ఇన్నాళ్లూ సాగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నా ఆశించిన స్దాయిలో రావడం లేదన్న చర్చ నేపథ్యంలో తాజాగా సమాచార మంత్రి వేణుగోపాలకృష్ణ చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు కొత్త చర్చకు తావిస్తోంది. రాజధాని ఏదో తేలితే కానీ పెట్టుబడులు రావన్న వాదనను జగన్ సర్కార్ అంత సీరియస్ గా తీసుకోవడం లేదని తెలుస్తోంది. కానీ విపక్షాలు మాత్రం రాజధానిని త్వరగా తేల్చాల్సిందేనని పట్టుబడుతున్నాయి.

రాజధాని-పెట్టుబడుల లింక్
ఓ రాష్ట్రానికి రాజధాని ఎక్కడో తేలితే కానీ పెట్టుబడులు రావా, పెట్టుబడులు పెట్టాలంటే రాజధానిని మించిన ప్రాంతం ఇంకోటి ఉండదా, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందే అవకాశం ఉన్నప్పుడు రాజధాని లోనే పెట్టుబడులు పెట్టాల్సిన అవసరమేముంది ? పెట్టుబడుల రాక ఓ ప్రాంతానికి పరిమితమైతే జరిగే దుష్పరిణామాలేంటి ? అసలు రాజధానికీ, పెట్టుబడులకూ లింక్ చేసుకోవడం సహేతుకమేనా ? ఆ అవసరం ఎందుకొస్తోంది అనే అంశాలు ఇప్పుడు ఏపీలో చర్చకు తావిస్తున్నాయి.

రాజధాని లేకే పెట్టుబడులు రావడం లేదా ?
ఏపీలో గతంలో అమరావతిని రాజధానిగా అప్పటి టీడీపీ సర్కార్ నిర్ణయించింది. దీంతో అక్కడికి పెట్టుబడుల రాక మొదలైంది. ముందుగా పలు విద్యాసంస్ధలు అమరావతికి రావడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత వాణిజ్య సముదాయాల ఏర్పాటుకు చర్చలు జరిగాయి. భవిష్యత్తులో రాజధానిగా అభివృద్ధి చెందే ప్రాంతం కావడంతో రియల్ ఎస్టేట్ రంగం కూడా దూకుడుగా ముందుకెళ్లింది. అదే సమయంలో విశాఖ వంటి వ్యూహాత్మక నగరాల్లోనూ పెట్టుబడులు అంతకంటే ఎక్కువే వచ్చాయి. లులూ, ఆదానీ వంటి సంస్ధలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకున్న సమయంలో ఏపీ రాజధాని అమరావతే. దీంతో రాజధానిలోనే పెట్టుబడులు వస్తాయన్నది కేవలం భ్రమేనని గతంలోనే తేలిపోయింది.

మంత్రి వేణు చెప్పిందిదే..
రాజధాని ఏదో తెలియకపోవడం వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఈ రెండు అంశాలకూ లింక్ లేదని సమాచార మంత్రి వేణుగోపాలకృష్ణ తేల్చిచెప్పేశారు. రాష్ట్రానికి రాజధాని లేకపోవడం వల్ల పెట్టుబడులు రావడం లేదన్నది ఒట్టి భ్రమేనన్నారు. రాష్ట్రంలో రాజధానిని చూసి పెట్టుబడులు రావని, పాలన చూసి వస్తాయన్న మరో చేదు నిజాన్ని కూడా ఆయన చెప్పేశారు. గతంలో అమరావతి రాజధానిగా ఉన్నప్పుడు చంద్రబాబు దావోస్ వెళ్లి ఎన్ని పెట్టుబడులు తెచ్చారన్న ప్రశ్నను కూడా మంత్రి వేణు సంధించారు. దీంతో రాజధానికీ, పెట్టుబడులకు లింక్ లేదన్న విషయాన్నీ చెప్పేశారు.

అనిశ్చితే అసలు కారణం ?
అయితే రాజధానులకు, పెట్టుబడులకూ లింక్ లేదన్న విషయం కొంతమేర వాస్తవమే అయినా అసలు నిజం మాత్రం మరొకటి ఉంది. రాజధాని పై క్లారిటీ ఉన్నంత మాత్రాన పెట్టుబడులు రాకపోవచ్చేమో కానీ.. సస్పెన్స్ ఉండటం మాత్రం పెట్టుబడుల వాతావరణానికి మంచిది కాదన్నది నిపుణులు చెబుతున్న మాట. ఎందుకంటే రాజధానిగా ఒకటికి మించిన ప్రాంతాలు ఉన్నప్పుడు, అలాగే అవి కూడా కచ్చితంగా ఉంటాయన్న నమ్మకం లేనప్పుడు పెట్టుబడులు పెట్టేవారు కచ్చితంగా ఆలోచిస్తారు. ఎంత ప్రభుత్వ పాలన సజావుగా ఉన్నా, సుస్ధిరమైన ప్రభుత్వం ఉన్నా అనిశ్చితి మాత్రం పెట్టుబడుల వాతావరణానికి ఇబ్బందికరమే.












Click it and Unblock the Notifications