అక్కడ హ్యాట్రిక్‌పై కన్నేసిన టీడీపీ: వైసీపీ అడ్డుకుంటుందా?
Repalle Assembly round up 2024: బాపట్ల జిల్లాలోని రేపల్లె నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ హ్యాట్రిక్‌పై కన్నేసింది. ఇప్పటికి వరుసగా రెండుసార్లు ఇక్కడ విజయదుందుభి మోగించింది. ముచ్చటగా మూడోసారి పాగా వేయాలనే పట్టుదలతో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎలా అడ్డుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది.
బాపట్ల లోక్‌సభ పరిధిలోని జనరల్ అసెంబ్లీ నియోజకవర్గం.. రేపల్లె. నిజాంపట్నం, నగరం, చెరుకుపల్లి, రేపల్లె మండలాలు ఉన్నాయి. 1,94,748 మంది ఓటర్లు ఉన్నారు. సంఖ్యాపరంగా చూసుకుంటే గౌడ సామాజిక వర్గం ఓటుబ్యాంకు భారీగా ఉంటుందిక్కడ. ఆ తరువాత కాపు, మత్స్యకారులు ప్రధానంగా ఉంటారు. వారి తరువాత ఎస్సీ, కమ్మ, ముస్లిం ఓటర్లు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటారు.

రాజకీయంగా కమ్మ, కాపు, బీసీలు ప్రధాన పాత్ర పోషిస్తుంటారు. 1952 నుంచి 2019 వరకు 15 సార్లు ఎన్నికలు జరగ్గా.. కమ్మ సామాజిక వర్గీయులు 11 సార్లు గెలిచారు. గౌడ కులం వారు రెండుసార్లు విజయం సాధించారు. మత్స్యకారులు, కాపు నాయకులు ఒక్కోసారి ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు ఆరుసార్లు ఎన్నికలు జరిగాయి. మోటూరు హనుమంతరావు, కొరటాల సత్యనారాయణ, యడం చెన్నయ్య, యడ్ల వెంకట్రావు వంటి హేమాహేమీలు రేపల్లెలో విజయం సాధించారు. సీపీఐ, కాంగ్రెస్ మూడుసార్లు ఇక్కడ విజయం సాధించాయి. టీడీపీ ఆవిర్భవించాక తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగాయి. అత్యధికంగా ఆరుసార్లు ఆ పార్టీనే గెలిచింది. కాంగ్రెస్ మూడు సార్లు ఈ స్థానాన్ని నిలబెట్టుకుంది.
అంబటి రాంబాబు ఇక్కడి నుంచే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1989లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఇక్కడ గెలిచారు. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధిగా మోపిదేవి వెంకటరమణ టీడీపీకి చెందిన అనగాని సత్యప్రసాద్‌పై 5,945 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2014లో రిజల్ట్ రివర్స్ అయింది.
ఈ ఎన్నికల్లో అనగాని సత్యప్రసాద్ విజయం సాధించారు. మోపిదేవి వెంకటరమణను ఓడించారు. 2019లో కూడా మళ్లీ వారిద్దరే పోటీ చేశారు. సేమ్ రిజల్ట్ వెలువడింది. మోపిదేవిపై 11,555 ఓట్ల మెజారిటీతో గెలిచారు అనగాని సత్యప్రసాద్. 2024 ఎన్నికల్లో మాత్రం వ్యూహం మార్చింది వైసీపీ. డాక్టర్ ఈవూరి గణేష్‌ను బరిలోకి దింపింది. టీడీపీ నుంచి అనగాని పోటీలో ఉన్నారు.












Click it and Unblock the Notifications