రాజధానిలో అడ్డగోలుగా 'భూ' కొనుగోలు: ఐటీ శాఖ ఆరా, ఎవరా మంత్రి?
అమరావతి: రాష్ట్ర విభజన అనంతరం గుంటూరు-విజయవాడ మధ్య ఏపీ రాజధానిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో పెద్దఎత్తున భూములు కొనుగోలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజధాని ప్రాంతంలో జరుగుతున్న లావాదేవీల్లో నల్లధనం ఏరులైపారుతోందని నిఘా వర్గాల సమాచారం.
దీంతో రాజధాని ప్రాంతంపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు దృష్టిసారించారనే వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి 'ఆదాయం'పై ఐటీ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారని తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా నల్లధనం వెల్లడికి కేంద్రం సెప్టెంబరు 30 వరకు గడువు ఇచ్చింది.
దీనిని సద్వినియోగం చేసుకుని ఏపీ, తెలంగాణల్లోని వ్యాపారులు తమ 'లెక్కలు' వెల్లడిస్తారని, 'నల్ల ధనం' వివరాలను బయటపెడతారని ఐటీ అధికారులు భావించారు. అయితే, వారి అంచనాలకు తగ్గట్టుగా నల్లధనం వివరాలను బయటపెట్టలేదు. దేశంలోనే అత్యధిక ఆదాయం హైదరాబాద్‌లోనే వెలుగులోకి వచ్చింది.

ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో అత్యంత స్వల్పంగా నల్లధనం వివరాలు బయటపడ్డాయి. ఏపీలో కొత్తగా రాజధాని అభివృద్ధి చెందుతుండడం, పారిశ్రామిక వేత్తలు తమ వ్యాపారాలను ప్రారంభిస్తుండటంతో పాటు ఏపీలో రియల్ ఎస్టేట్ పుంజుకోవడం వల్ల విజయవాడ కారణంగా నల్లధనం భారీ ఎత్తున చేతులు మారుతోందని అధికారులు అంచనా వేశారు.
సీఆర్‌డీఏ పరిధిలో ఇప్పటివరకు దాదాపు 40 వేల కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు జరిగాయి. ఇందులో అత్యధిక భాగం బ్లాక్‌మనీనే అని ఒక ప్రాథమిక నివేదికను తయారు చేశారు. అయితే, అంచనాకు పూర్తి భిన్నంగా విజయవాడ అతి స్వల్ప ఆదాయాన్ని నమోదు చేసింది.
ఐటీ సేకరించిన గణాంకాల ప్రకారం కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో సుమారు వెయ్యి మంది భారీస్థాయిలో నల్లధనాన్ని కలిగి ఉన్నారు. అయితే, కేవలం 40 మంది మాత్రమే తమ నల్లధనం వివరాలను వెల్లడించారు. ఇక, ఏపీకి చెందిన ఓ మంత్రి రాజధాని ముసుగులో అడ్డగోలుగా సంపాదించారట.
అయితే ఆయన ఎంతో కొంత ఆదాయాన్ని చూపుతారని ఐటీ అధికారులు అంచనా వేశారు. అయితే అలా జరగలేదు. ఈ క్రమంలో ఐటీ అధికారులు ఇక దాడులకు సిద్ధం కావాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, సత్యప్రభల వ్యాపారాలపై (సెప్టెంబరు 30కి ముందే) దాడులు నిర్వహించారు.
అయినా సరే రాష్ట్రంలోని మిగతా నల్ల కుబేరులు వారి వివరాలను బయట పెట్టలేదు. దీంతో ఐటీ శాఖలో ప్రత్యేక చర్చ జరుగుతోంది. సీఆర్‌డీఏ పరిధిలో భూముల క్రయవిక్రయాలు, అనధికారిక లావాదేవీలపై ఐటీ ఇప్పటికే ఒక నివేదిక సిద్ధం చేసింది. ఈ జాబితాలో ఏపీకి చెందిన ఓ మంత్రితో పాటు పలువురు రాజకీయ నేతల పేర్లు ఉన్నాయని సమాచారం.
అక్టోబర్ 15న ఐటీ శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో జాతీయ స్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ సమావేశం అనంతరం రాష్ట్రంలో ఐటీ శాఖ ప్రత్యేకంగా రాజకీయ నేతలను దృష్టిలో ఉంచుకుని దాడులు నిర్వహించనుందని తెలిసింది.












Click it and Unblock the Notifications