ఏపీ సర్కార్ కు కొత్త తలనొప్పి : 'ఉద్యోగుల తరలింపు ఓకె.. ఫైళ్లతో వచ్చింది సమస్య..'
హైదరాబాద్/విజయవాడ : మొత్తానికి ఏపీ సచివాలయ ఉద్యోగులను రాజధాని ప్రాంతానికి తరలించే ప్రక్రియ మొదలవడం.. రాజధానిలో తాత్కాలిక సచివాలయం ప్రారంభం అవడం జరిగిపోయాయి. ప్రస్తుతం ఉద్యోగులనైతే తరలిస్తున్నారు గానీ హైదరాబాద్ సచివాలయం నుంచి ఫైళ్ల తరలించడంలో మాత్రం ఏపీకి కష్టాలు తప్పేలా లేవు.
ఫైళ్ల సంఖ్య వేలల్లో ఉండడం.. అందులోను ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించిన ఫైళ్లే 40 వేల వరకు ఉండడంతో రాష్ట్రాల మధ్య పంపిణీ తర్వాత గానీ ఏపీకి ఫైళ్ల తరలింపు సాధ్యపడేలా లేదు. ప్రాథమిక అంచనా ప్రకారం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఉమ్మడి ఫైళ్లు 40 వరకు ఉండగా, 20 వేల వరకు ఉమ్మడి పుస్తకాలు ఉన్నాయి.

ప్రస్తుతం సచివాలయంలో ఉన్న రికార్డ్ లైబ్రరీ, సెంట్రల్ రికార్డు బ్రాంచ్, న్యాయశాఖ లైబ్రరీ, ప్లానింగ్ లైబ్రరీ విభాగాల్లోనే రెండు రాష్ట్రాలకు చెందిన కీలకమైన ఫైళ్లన్నీ ఉన్నట్టు తెలుస్తోంది. న్యాయశాఖ లైబ్రరీ విభాగంలో పుస్తకాలు, ఫైళ్లు కలిపి దాదాపు 20 వేల వరకు ఉన్నట్టు సమాచారం. అలాగే ప్రణాళిక శాఖ లైబ్రరీ విభాగంలో 10 వేలు, సాధారణ పరిపాలన విభాగంలో రెండు రాష్ట్రాలకు సబంధించిన 15 వేల ఫైళ్ల వరకు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
కాగా, ఈ మొత్తం ఫైళ్లలో ఎక్కువ భాగం గెజిట్, చట్టాలకు సంబంధించిన ఫైళ్లే ఉన్నట్టు తెలుస్తోంది. ఇవిగాక జనాభా లెక్కల వివరాలు, నిజాం కాలం నాటి పత్రాలు కూడా భారీ సంఖ్యలోనే పేరుకుపోయి ఉన్నాయి.
అయితే ఉద్యోగులను తరలించిన సులభంగా ఈ ఫైళ్లను తరలించడం ఏపీ సర్కార్ కు సాధ్యపడదు. ఎందుకంటే ఫైళ్లకు సంబంధించి ఉమ్మడి వ్యవహారాలు తేలాలంటే తెలంగాణ సర్కార్ తో సంప్రదింపులు జరపాల్సిందే. మొత్తంగా ఇందుకోసం ఇరు రాష్ట్రాల తరుపున ప్రత్యేకంగా ఓ జాయింట్ యాక్షన్ కమిటీని వేస్తే గానీ ఈ పనులు ముందుకు సాగవు. ఇదే విషయమై ప్రస్తుతం ఏపీ ఉన్నతాధికారులు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసే పనిలో ఉన్నట్టు సమాచారం.
సంక్షేమ భవన్ లో ఫైళ్లపై గందరగోళం..
ఇదిలా ఉంటే.. సంక్షేమ శాఖకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రాల ఫైళ్ల వ్యవహారం గందరగోళంగా ఉందన్న వాదన వినిపిస్తోంది. ఉమ్మడి ఫైళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాతే ఏపీ ప్రభుత్వం తమ ఫైళ్లను తీసుకెళ్లాల్సి ఉండగా.. ఏపీ అధికారులు ఇప్పుడే వాటిని తరలించేస్తున్నారని ఆరోపిస్తున్నారు తెలంగాణ ఉద్యోగులు.












Click it and Unblock the Notifications