వీడిన వివేకా హత్య మిస్టరీ-జగన్ సహా వైసీపీ మౌనం- అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా ?
ఏపీలో మూడేళ్ల క్రితం తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై జరుగుతున్న సీబీఐ దర్యాప్తులో అంతకంటే ఎక్కువ సంచలనాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా వివేకా హత్య జరిగిన తీరు గతంలో సంచలనం కాగా.. ఇప్పుడు వివేకా హత్యకు కారకులని భావిస్తున్న వారు సంచలనానికి కేంద్ర బిందువుగా మారుతున్నారు. అయితే సీఎం వైఎస్ జగన్ కానీ, వైసీపీ నేతలు కానీ దీనిపై నోరు మెదపకపోవడం చర్చనీయాంశమవుతోంది.

వివేకా హత్యలో సంచలనాలు
వైఎస్ వివేకా హత్య కేసులో రోజుకో సంచలనం రేగుతోంది. ముఖ్యంగా వైఎస్ వివేకాను సొంత కుటుంబ సభ్యులే హతమార్చి ఉండొచ్చన్న అనుమానాలను సాక్ష్యులు, నిందితులు వ్యక్తం చేస్తున్నారు. సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలాల్లో వీరు చెప్పిన విషయాలు దాదాపు ఏడాది ఆలస్యంగా ఇప్పుడు బయటికి వస్తున్నాయి. దీంతో ఈ వాంగ్మూలాల వ్యవహారం వైఎస్ కుటుంబాన్ని దోషులుగా నిలబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై వస్తున్న అనుమానాలు, ఫిర్యాదులకైతే లెక్కలేకుండా పోతోంది.

అవినాష్ చుట్టూ ఉచ్చు ?
తన పెదనాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ తన ఛార్జిషీట్ లో అనుమానితుడిగా మాత్రమే పేర్కొంది. కానీ తన మరో పెదనాన్న వైఎస్ ప్రతాప్ రెడ్డి, కజిన్, వివేకా కుమార్తె సనీతారెడ్డి, బావ నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సహా పలువురు సాక్ష్యులు అవినాష్ రెడ్డి పాత్రపై సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే వీటిని నిరూపించేందుకు తగిన ఆధారాలు లేకపోవడం వల్లే సీబీఐ ఇప్పటివరకూ అవినాష్ ను ప్రశ్నించలేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తాజా లీకులపై జగన్ మౌనం
సీబీఐ దర్యాప్తులో భాగంగా నిందితులతో పాటు వివేకా కుటుంబ సభ్యులు ఇచ్చిన వాంగ్మూలాల్లో ఇప్పటివరకూ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, శివశంకర్ రెడ్డిని నిందితులుగా పేర్కొంటుండగా.. ఇప్పుడు వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఏకంగా సీఎం జగన్ పైనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయన భార్య సునీతారెడ్డి కూడా జగన్ పై పరోక్షంగా అనుమానాలు వ్యక్తం చేశారు. అయినా వీటిపై జగన్ ఇప్పటివరకూ స్పందించలేదు. తాను స్పందిస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని భయపడుతున్నారో, లేక కేసు మరింత క్లిష్టమవుతుందని అనుకుంటున్నారో తెలియదు కానీ జగన్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు.
Recommended Video

జగన్ గతంలో అలా.. ఇప్పుడు ఇలా
గతంలో 2019 ఎన్నికలకు ముందు వివేకా హత్య జరిగినప్పుడు దీనిపై సీబీఐ దర్యాప్తు కోరిన జగన్, చంద్రబాబు ప్రభుత్వం అందుకు ఒప్పుకోలేదని తీవ్ర విమర్శలు చేశారు. ఈ కేసుపై ఎవరూ మాట్లాడకుండా కోర్టుకు వెళ్లి ఉత్తర్వులు కూడా తెచ్చుకున్నారు. అప్పట్లో ఎన్నికలు ఉండటంతో ఈ కేసు ప్రభావం ఆ ఎన్నికలపై పడకుండా ఆ మేరకు జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఇప్పుడు అంతకు మించిన విషయాలు సీబీఐ దర్యాప్తులోనే వెలుగుచూస్తుండటం, సాక్ష్యులు, నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలు కూడా వాటికి సరిపోలుతున్నా, మీడియాలో అసలు ఏ జరిగిందో, తన, అవినాష్ పాత్రపై కథనాలు వస్తున్నా జగన్ మాత్రం స్పందించడం లేదు. ఇప్పట్లో ఎన్నికలు లేకపోవడంతో రాజకీయంగా నష్టం లేదని భావించడమే ఇందుకు ఓ కారణంగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications