ఊరుకునే పరిస్థితి ఉండదు: కెసిఆర్‌పై జగన్
హైదరాబాద్: ఉద్యోగుల విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తప్పు పట్టారు. రాష్ట్ర విబజన జరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగులను లక్ష్యంగా చేసుకని ఉద్రిక్తతలు పెంచేలా నాయకులు వ్యాఖ్యలు చేయడం సరి కాదని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సాయంత్రం మీడియాకు ఓ లేఖను విడుదల చేశారు.
రాజకీయ నాయకులు రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం మానుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతూ ఒక పక్క అన్నదమ్ముల్లా విడిపోదామని అంటున్న కెసిఆర్ మరో పక్క రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం సరి కాదని ఆయన అన్నారు.

ఇరు ప్రాంతాలకు చెందిన ఉద్యోగుల మధ్య సుహృద్భావ వాతావరణంలో విభజన ప్రక్రియ సాగాలని, లేనట్లయితే చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదని ఆయన అన్నారు. ఉద్యోగులకు తమ పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఉద్యోగుల న్యాయపరమైన హక్కులకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు.
విభజన వల్ల తలెత్తిన ఉద్యోగుల సమస్యను సీమాంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్న చంద్రబాబు నాయుడు కూడా అర్థం చేసుకుని వారికి సంపూర్ణంగా అండగా నిలవాల్సిన అవసరం ఉందని జగన్ అన్నారు. తమ జీతాలు, జీవితాల గురించి భయాందోళనలు ఉన్న ఉద్యోగులకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంతో పాటు గవర్నర్‌పై కూడా ఉందని ఆయన అన్నారు.
రాజ్యాంగం ప్రకారం జరిగిన విభజన ప్రక్రియకు సంబంధించి తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేయడం, ఉమ్మడి రాజధానిలో పనిచేయాల్సిన ఉద్యోగుల మధ్య వాతావరణాన్ని కలుషితం చేయడం తీవ్రమైన అంశాలని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యపై తాము మొదటి నుంచీ హెచ్చరిస్తూనే ఉన్నామని, అయినప్పటికీ ఈ అంశాలపై దృష్టి పెట్టకుండా అడ్డగోలుగా విభజన చేశారని ఆయన అన్నారు ప్రాంతాలవారీగా రెచ్చగొట్టే వైఖరిని ఉపేక్షించడం తగదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications