ఏపీ గెజిట్ వెబ్ సైట్లో అన్ని జీవోల అప్ లోడ్.. జగన్ సర్కార్ కీలక ఆదేశాలు..!
ఏపీలో ప్రభుత్వం ప్రతీ రోజూ పలు అంశాలపై జీవోలు జారీ చేస్తుంటుంది. వీటిని గతంలో జీవోఐఆర్ వెబ్ సైట్లో అప్ లోడ్ చేసే వారు. వీటిని సంబంధిత వ్యక్తులు, సంస్ధలు, అధికారులు చూసి తెలుసుకునే వారు. వాటి ఆధారంగా నిర్ణయాలు తీసుకునేవారు. వీటిలోనూ కొన్ని రహస్య జీవోలు ఎలాగో ఉంటాయి. వాటిపైనా చర్చ జరిగేది. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2021లో పలు మార్పులు చేశారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం జీవోల్ని రహస్యంగా ఉంచుతోందని ఆరోపిస్తూ కొందరు న్యాయస్ధానాల్ని ఆశ్రయించారు. ఆ తర్వాత 2021లో ప్రభుత్వం జీవోఐఆర్ వెబ్ సైట్ స్ధానంలో ఏపీగెజిట్ వెబ్ సైట్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులోనే జీవోలు అప్ లోడ్ చేయాలంటూ ప్రభుత్వ శాఖల్ని ఆదేశించింది. ఇందుకోసం జీవో నంబర్ 100 ను కూడా జారీ చేసింది. దీంతో ప్రభుత్వ శాఖలు ఏపీ గెజిట్ వెబ్ సైట్లో జీవోలు అప్ లోడ్ చేస్తున్నాయి.

అయితే ఏపీ గెజిట్ వెబ్ సైట్లో కూడా ప్రభుత్వ శాఖలు అన్ని జీవోలు అప్ లోడ్ చేయడం లేదు. దీంతో ప్రభుత్వంతో పాటు సంబంధిత వ్యక్తులు, అధికారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం మరోసారి జీవోల అప్ లోడింగ్ పై కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ జీవోలను తప్పనిసరిగా వెబ్ సైట్ లో పెట్టాలని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. APEGAZETTE వెబ్ సైట్ లో తప్పనిసరిగా అప్ లోడ్ చేయాలని అన్ని శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు పంపింది.
ఇప్పటివరకూ ఏపీ గెజిట్ పేరుతో వెబ్ సైట్ ఉన్నా కొన్ని శాఖలు మాత్రమే పూర్తి స్ధాయిలో జీవోలను వెబ్ సైట్ లో పెడుతున్నట్లు గుర్తించిన ప్రభుత్వం తాజా ఆదేశాలు ఇచ్చింది. 2021 లో విడుదల చేసిన జీవో 100 నిబంధనలు అన్ని శాఖలు అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఇకపై అన్ని జీవోల్ని వెబ్ సైట్లో అప్ లోడ్ చేసేందుకు ప్రభుత్వ శాఖలు సిద్ధమవుతున్నాయి.












Click it and Unblock the Notifications