విద్యాదీవెన హైకోర్టు తీర్పుపై త్వరలో అప్పీలు-తల్లులకే ఇవ్వాలని కోరనున్న జగన్ సర్కార్
ఏపీలో వైసీపీ సర్కార్ జగనన్న విద్యాదీవెన పేరుతో ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని అమలు చేస్తోంది. అయితే గతంలో సీఎం జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభమైన ఈ పథకం రూపురేఖలు మార్చి తల్లుల ఖాతాల్లోనే ఫీజుల డబ్బు వేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. దీన్ని తప్పుబట్టిన హైకోర్టు ఈ మేరకు ఇచ్చిన జీవోల్ని తాజాగా కొట్టేసింది.
ఏపీలో జగనన్న విద్యాదీవెన పథకం అమలు విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై విద్యార్ధుల తల్లితండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.ఇన్నాళ్లూ ఫీజుల డబ్బులు తీసుకున్న తల్లితండ్రుల్లో 40 శాతం వరకూ కాలేజీలకు వాటిని చెల్లించలేదు. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో మిగతా వారి మీద కూడా ప్రభావం పడబోతోంది. దీంతో ఈ ఫీజు రీయింబర్స్ మెంట్ కాస్తా కాలేజీల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది. దీనిపై స్పందించిన మంత్రి అవంతి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేస్తున్నామని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. రెగ్యులేటరీ కమిషన్‌తో ఫీజులు నిర్ణయించాక నాలుగు విడతల్లో విద్యార్థులకు ఫీజులను చెల్లిస్తున్నామన్నారు. పారదర్శకత కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్నివిద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయాలని సీఎం నిర్ణయించారని తెలిపారు. ఈ విధానంతో కళాశాలలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉంటుందని అవంతి చెప్పారు. జగనన్న విద్యాదీవెనపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పూర్తి సమాచారంతో హైకోర్టులో త్వరలో రివ్యూ పిటిషన్ వేస్తామన్నారు. ఈ పథకాన్ని యథాతధంగా అమలు చేయాలని పిటిషన్‌లో కోర్టును కోరనున్నట్లు ఆయన తెలిపారు.
Recommended Video
మరోవైపు ఇంటర్ అడ్మిషన్లు ఆన్‌లైన్‌లో చేపట్టవద్దని హైకోర్టు ఇచ్చిన మరో తీర్పుపై ఆదేశాలు ఇంకా తమకు అందలేదని మంత్రి అవంతి తెలిపారు. విద్యార్థుల ప్రయోజనం కోసమే ఇంటర్ ఆన్‌లైన్ అడ్మిషన్లను అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన తెలిపారు. ఇంటర్, డిగ్రీలో ఆన్‌లైన్ అడ్మిషన్ల ద్వారా పరిపూర్ణంగా రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. ఈ ఏడాది ఆన్‌లైన్ అడ్మిషన్లు చేసుకోవాలని గతేడాది హైకోర్టు ఆదేశించిందని మంత్రి చెప్పారు. ప్రైవేట్ యాజమాన్యాలు కోర్టులను మేనేజ్ చేస్తూ అడ్డంకులు సృష్టిస్తున్నాయని అన్నారు. పాఠశాలల్లో .001 శాతం మాత్రమే కరోనా కేసులు నమోదవుతున్నాయని... 10 కంటే ఎక్కువ కేసులు నమోదైతే పాఠశాలను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశాలిచ్చామని మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications