వార్డు సచివాలయాల ఉద్యోగులకు జగన్ మరో గుడ్ న్యూస్-వివరాలివే.. !
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఈ ఏడాది వరుసగా గుడ్ న్యూస్ లు చెబుతున్న సీఎం జగన్ తాజాగా మరో శుభవార్త అందించారు. దీంతో రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మారేందుకు వారికి మరో అవకాసం కలిగింది. ఇన్నాళ్లూ ప్రొబేషన్ కారణంగా వర్తింపచేయని ఓ నిబంధనను ఇప్పుడు వార్డు సచివాలయ ఉద్యోగులకు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో సచివాలయాల శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

సచివాలయాల ఉద్యోగులు..
రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్దిదారులకు మరింత చేరువ చేసేందుకు వీలుగా వైసీపీ సర్కార్ అధికారంలోకి రాగానే సీఎం జగన్ సచివాలయాల వ్యవస్ధను అందుబాటులోకి తెచ్చారు. రెండేళ్ల కాలానికి ప్రొబేషన్ తో నియమించిన సచివాలయాల ఉద్యోగులకు ఈ ఏడాది దాన్ని ఖరారు చేశారు.
దీంతో రెండున్నరేళ్ల వెయిటింగ్ కు తెరపడినట్లయింది. ఆ తర్వాత సచివాలయ ఉద్యోగుల కోరిక మేరకు మరిన్ని అంశాల్లో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఒక్కో నిబంధన వారికి అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా ప్రభుత్వం వారినుంచి వ్యక్తమైన మరో డిమాండ్ కు సై చెప్పింది.

వార్డు సచివాలయ ఉద్యోగుల సెలవులు
రాష్ట్రంలోని వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇన్నాళ్లూ రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా సెలవులు వర్తించడం లేదు. ప్రొబేషన్ లో ఉన్నప్పుడు ఇచ్చే నామమాత్రపు సెలవులు మాత్రమే వర్తిస్తున్నాయి. దీంతో వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఈ విషయాన్నివారు మున్సిపల్ శాఖ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వం ఇప్పుడు వారికి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా సెలవులు వర్తింపచేసేందుకు ఆదేశాలు జారీ చేసింది.

సెలవుల ప్రయోజనాలివే!
వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సెలవులు వర్తింపచేస్తూ ఇచ్చిన ఆదేశాల వల్ల ఇకపై వారికి కూడా సాధారణ సెలవులతో పాటు ఆప్షనల్ సెలవులు కూడా వాడుకునేందుకు వీలు కలుగుతుంది. అలాగే లీవు ఎన్ క్యాష్ మెంట్ కు కూడా అవకాశం కలుగుతుంది.
అలాగే పెన్షన్ ఇతర భత్యాలపైనా వీటి ప్రభావం కచ్చితంగా ఉండబోతోంది. దీంతో వార్డు సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ప్రభుత్వం తమను కూడా గుర్తించి సెలవులు వర్తింపచేయడం సంతోషంగా ఉందని వారు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications