Vizag Capital : వైజాగ్ కు రాజధాని తరలింపుపై జగన్ దూకుడు ! అన్ని శాఖలకు సర్కులర్ జారీ..!
ఏపీ కార్యనిర్వాహక రాజధానిని ఎన్నికలకు ముందు ఎలాగైనా వైజాగ్ కు తరలించి తీరాలని పట్టుదలగా ఉన్న జగన్ సర్కార్ ఇవాళ మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే వైజాగ్ కు అన్ని శాఖల తరలింపు కోసం తగిన ఏర్పాట్లు చేసేందుకు వీలుగా పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్ రావత్ , సాధారణ పరిపాలన శాఖ మానవ వనరుల విభాగం కార్యదర్శులతో కమిటీని నియమించింది. ఈ కమిటీ అప్పుడే పని మొదలుపెట్టేసింది.
విశాఖలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు కోసం వేగంగా ముందుకెళ్తున్న ప్రభుత్వం ఇందులో భాగంగా అన్ని శాఖల అవసరాలు తెలుసుకుంటోంది. ఇందుకోసం తాజాగా జారీ చేసిన జీవోలు 2004, 2015కు అనుగుణంగా అన్ని శాఖలకు సర్క్యులర్ లు జారీ చేసింది. ఇందులో పలు కీలక అంశాల్ని ప్రస్తావించింది. ఇందుకు అనుగుణంగా ఆయా శాఖలు స్పందించాలని కోరింది. దీంతో వైజాగ్ రాజధాని తరలింపు కోసం ఎంత వేగంగా అడుగులు పడుతున్నాయో అర్ధమవుతోంది.

విశాఖలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు కోసం మంత్రులు, శాఖకు ఎంత వసతి అవసరమో పంపాలని వైజాగ్ రాజధాని తరలింపుపై ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీ ఈ సర్కులర్లలో పేర్కొంది. ముఖ్యంగా ఒక్కో మంత్రికి అవసరమైన స్థలం ఇప్పటికే చూసారా? ఒకవేళ స్థలం ఎంపిక చేయనట్లైతే ఎన్ని చదరపు గజాల స్థలం కావాలో వివరాలు ఇవ్వాలని కమిటీ కోరింది.
శాఖల వారీగా ముఖ్య కార్యదర్శి, శాఖాధిపతులకి కావాల్సిన స్థలం వివరాలు ఇందులో కోరింది. ఇందుకోసం రెండు రకాల ఫార్మేట్ లను అన్ని శాఖలకు కమిటీ పంపింది.
వైజాగ్ లో ప్రతీ శాఖకు అవసరమైన స్ధలం అవసరాలు తెలుసుకునేందుకు ఇచ్చిన ఫార్మాట్లకు అనుగుణంగా సమాచారాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం గడువు కూడా పెట్టింది. ఈ నెల 17లోగా పూర్తి సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం నియమించిన ముగ్గురు అధికారుల కమిటీ ఈ సర్క్యులర్లలో కోరింది. దీంతో ప్రభుత్వం 17లోగా ఈ సమాచారం సేకరించి ఆ తర్వాత వైజాగ్ లో ఆయా శాఖల అవసరాల మేరకు స్ధలాల కేటాయింపు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదంతా పూర్తయ్యాక సీఎం జగన్ వైజాగ్ కు తరలివెళ్లనున్నారు.












Click it and Unblock the Notifications