వైజాగ్ పెట్టుబడుల సదస్సుకు ఎమ్మెల్సీ కోడ్ ముప్పు ? ఈసీ అనుమతిపై ఉత్కంఠ !
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ప్రభావం రాష్ట్రంలో పలు కార్యక్రమాలపై పడేలా ఉంది. ఇదే క్రమంలో విశాఖలో మార్చి 3,4 తేదీల్లో జరిగే ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023పై జగన్ సర్కార్ ఈసీ క్లారిటీ కోరినట్లు తెలుస్తోంది.
ఏపీలో త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లోకి వచ్చేసింది. దీంతో రాష్ట్రంలో జరుగుతున్న పలు కార్యక్రమాల్ని నేతలు, ప్రభుత్వం వాయిదా వేసుకోవడం లేదా రద్దు చేసుకోవాల్సిన పరిస్ధితులు తలెత్తబోతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో జరుగుతున్న నారా లోకేష్ పాదయాత్రపై ఎమ్మెల్సీ కోడ్ ఎఫెక్ట్ ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతుండగా.. దీనికి మించి విశాఖలో వచ్చే నెల 3, 4 తేదీల్లో ప్రభుత్వం తలపెట్టిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023పైనా ఈ ప్రభావం ఉండేలా కనిపిస్తోంది.

ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023
ఏపీలో విదేశీ పెట్టుబడులు ఆకర్షించే ఉద్దేశంతో విశాఖలో ప్రభుత్వం మార్చి 3, 4 తేదీల్లో రెండు రోజుల పాటు ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించబోతోంది. దీనికి సన్నాహకంగా ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో కర్టెన్ రైజర్ ఈవెంట్స్ కూడా నిర్వహిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక సదస్సు ద్వారా రాష్ట్రానికి భారీ ఎత్తున విదేశీ పెట్టుబడులు ఆకర్షించ వచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అంతే కాదు ఈ సదస్సును కాబోయే ఏపీ రాజధాని విశాఖకు బ్రాండింగ్ కు కూడా ఉపయోగించుకోవచ్చని జగన్ సర్కార్ ఆలోచిస్తోంది. అయితే దీనికి చివరి నిమిషంలో ఓ అడ్డంకి వచ్చిపడేలా ఉంది.

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఎఫెక్ట్
ఏపీలో త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్రంలోని 13 ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 8 స్థానిక సంస్థల నియోజకవర్గాలు, మూడు గ్రాడ్యుయేట్, రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ విడుదలకానుంది. అలాగే ఈ ఎన్నికలకు పోలింగ్ మార్చి 13న ఉంటుంది. తర్వాత ఓట్ల లెక్కింపు మార్చి 16న జరగనుంది. దీంతో ఈ నెల రోజుల పాటు ఎన్నికల కోడ్ అమల్లోకి రాబోతోంది. దీని అమలు కోసం ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. దీని ప్రభావం రాష్ట్రంలో పలు కార్యక్రమాలపై ఉండబోతోంది. అవేంటన్నది ఈసీ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

ఈసీ క్లారిటీ కోరిన జగన్ సర్కార్ ?
ఏపీలో తాము మార్చి 3, 4 తేదీల్లో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వర్తిస్తుందా లేదా అన్న దానిపై క్లారిటీ లేదు. దీంతో విదేశీ పెట్టుబడిదారులు, దౌత్యవేత్తలు కూడా హాజరయ్యే ఈ వీవీఐపీ సదస్సుకు చివరి నిమిషంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఎన్నికల కోడ్ పై క్లారిటీ ఇవ్వాలని విశాఖ జిల్లా అధికారులు ఈసీకి లేఖ రాసినట్లు తెలుస్తోంది. దీనిపై ముందుగా క్లారిటీ వచ్చేస్తే మార్పులు చేర్పులు చేసుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అలా కాకుండా చివరి నిమిషం వరకూ మౌనంగా ఉంటే, అప్పుడు ఈసీ రద్దు చేస్తే ఇబ్బందులు తప్పవు. దీంతో ఈసీ క్లారిటీ కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోంది.












Click it and Unblock the Notifications