APSRTC ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..! కీలక జీవో జారీ..
ఏపీలో ఆర్టీసీ ఉద్యోగుల్ని గతంలో ప్రభుత్వంలో విలీనం చేసి, కొందరికి పీఆర్సీ ప్రయోజనం కల్పించిన జగన్ సర్కార్.. ఇప్పుడు మిగిలిన వారికి కూడా దాన్ని వర్తింపచేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి రాగానే ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో వారంతా ప్రభుత్వ కార్పోరేషన్ ఉద్యోగుల నుంచి నేరుగా ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోయారు. ఆ తర్వాత కూడా ఆర్టీసీ ఉద్యోగుల ప్రయోజనాల విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం అదే క్రమంలో తాజాగా మరో నిర్ణయం తీసుకుంది.

ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులకు వైసీపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో పీఆర్సీ ప్రయోజనం కల్పించిన సర్కార్.. ఇప్పుడు ఆర్టీసీలో ఉద్యోగులకు కూడా దాన్ని వర్తింపచేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఆర్టీసీలో మెజారిటీ ఉద్యోగులకు పీఆర్సీ ప్రయోజనం వర్తింప జేసిన ప్రభుత్వం.. ఇప్పుడు మిగిలిన వారికి కూడా దాన్ని వర్తింపచేసేలా ఆదేశాలు ఇచ్చింది. వీరంతా గత కొంతకాలంగా ఈ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న వారే. దీంతో ప్రభుత్వం వీరి విజ్ఞప్తిని మన్నించింది.

ప్రమోషన్ ఉద్యోగులకూ పీఆర్సీ వర్తింపు
ఏపీఎస్ఆర్టీసీలో పదోన్నతి పొందిన ఉద్యోగులకూ కొత్త పీఆర్‌సీ ప్రకారం వేతనాలు మంజూరు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ చొరవతో జీవో విడుదల చేశారు. బకాయిలతో కలిపి చెల్లించేలా ఇందులో ఉత్తర్వులు ఇచ్చారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 2,096 మందికి లబ్ధి చేకూరబోతోంది. ప్రస్తుతం ఆర్టీసీలో రాష్ట్ర వ్యాప్తంగా 51,488 మంది ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 2,096 మందికి పదోన్నతి లభించింది. వీరిలో 27 మంది డిపో మేనేజర్లు, 18 మంది అసిస్టెంట్ డీఎంలు, 148 మంది గ్రేడ్-1 కండక్టర్లు, 332 మంది గ్రేడ్-1 డ్రైవర్లు, 197 మంది అసిస్టెంట్ డిపో క్లర్కులు, 345 మంది ఆర్టిజాన్‌లు, 198 మంది మెకానిక్‌లు, 322 మంది సూపర్‌వైజర్లు, 44 మంది సెక్యూరిటీ విభాగం వారితో పాటు ఇతరులు 465 మంది ఉన్నారు.

జగన్ చొరవతో ఇలా..
గతంలో ఆర్టీసీలో ప్రమోషన్ పొందిన ఉద్యోగులకు పీఆర్సీ వర్తింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా.. డీపీసీ నిబంధనలకు విరుద్ధంగా, ప్రభుత్వ అనుమతి లేకుండా పదోన్నతి కల్పించారంటూ ఆర్థిక శాఖ అభ్యంతరం తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త పీఆర్‌సీ వీరికి వర్తింపజేయడం కుదరదని తెగేసి చెప్పింది. దీంతో పదోన్నతి పొందిన వారిని మినహాయించి 49,392 మందికి 2022 సెప్టెంబర్ 1నుంచి కొత్త పీఆర్‌సీ అమలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఉద్యోగ సంఘాలు ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాయి. దీంతో సీఎం సానుకూలంగా స్పందించి.. వారికి న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫలితంగా పదోన్నతి పొందిన వారికి కూడా కొత్త పీఆర్‌సీ వర్తింపజేస్తూ బకాయిలతో సహా చెల్లించేలా ఈ నెల 24న ఉత్తర్వులు జారీ చేశారు.












Click it and Unblock the Notifications