ఉద్యోగులకు ఏపీ సర్కార్ మరో పిలుపు-ఈసారి మంత్రుల కమిటీతో భేటీ-అజెండాలో అవే కీలకం !
ఏపీలో మార్చి 9 నుంచి ఉద్యమానికి సిద్ధమవుతున్న ఉద్యోగుల్ని బుజ్జగించేందుకు ఇవాళ మంత్రుల కమిటీ వారిని చర్చలకు ఆహ్వనించింది.
ఏపీలో వైసీపీ సర్కార్ గతంలో ఇచ్చిన హామీల అమలు కోరుతూ ఉద్యోగ నేతలు ఈ నెల 9 నుంచి రోడ్డెక్కబోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వంతో పలు దఫాలుగా జరిగిన చర్చలు విఫలం కావడం, కింది స్ధాయి ఉద్యోగుల నుంచి ఎదురవుతున్న ఒత్తిడి నేపథ్యంలో ఉద్యోగ నేతలు రూటు మార్చారు. ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారి ఆగ్రహాన్ని చల్లార్చేందుకు తుది ప్రయత్నాలు మొదలుపెట్టింది.

ఉద్యోగుల్ని చర్చలకు పిలిచిన జగన్ సర్కార్
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఉద్యోగులకు పలు హామీలు ఇచ్చింది. వీటిలో చాలా మటుకు అమలు కాలేదు. ముఖ్యంగా వారం రోజుల్లో చేస్తానన్న సీపీఎస్ రద్దు కాకపోవడం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కాకపోవడంతో ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. అదే సమయంలో జీతాలు కూడా సకాలంలో క్రెడిట్ కాకపోవడంతో వారి ఆగ్రహం మరింత పెరుగుతోంది. డీఏ బకాయిలు, ఉద్యోగుల ఖాతాల్లో నుంచి జీపీఎఫ్ సొమ్ము తీసేసుకోవడం వంటి చర్యలతో ప్రభుత్వంపై ఉద్యోగులు రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 9 నుంచి ఉద్యమానికి వారు సిద్దమవుతున్నారు. పరిస్దితిని గ్రహించిన ప్రభుత్వం ఇప్పటికే మంత్రి బొత్స, సలహాదారులు సజ్జల, చంద్రశేఖర్ రెడ్డితో చర్చలు నిర్వహించినా ఫలించలేదు. దీంతో ఇవాళ మరోసారి మంత్రుల కమిటీతో చర్చలు ఏర్పాటు చేశారు. దీనికి రావాలని ఉద్యోగ సంఘాల్ని ఆహ్వానించారు.

మంత్రులతో చర్చల అజెండా
ప్రభుత్వంతో ఉద్యోగ నేతలు జరుపుతున్న చర్చల్లో ప్రతిసారీ చెప్పిన అజెండా ఒకటి, అక్కడికి వెళ్లేసరికి మరో అజెండా ఉంటోందని నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఆర్ధిక, ఆర్ధికేతర అంశాలపై చర్చిద్దామని ఉద్యోగులకు కేబినెట్ సబ్ కమిటీ నుంచి పిలుపువచ్చింది. దీంతో తమకు ఎప్పటినుంచో పెండింగ్ ఉన్న డీఏ, ఇతర బకాయిలు, జీతాల చెల్లింపు వ్యవహారం వంటి అంశాలు ముందుగా తెరపైకి రానున్నాయి. ఆ తర్వాత మిగిలిన అంశాలపై ఉద్యోగులతో మంత్రులు చర్చించే అవకాశముంది. మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే ఈ భేటీలో మంత్రులు బొత్స, బుగ్గన, ఆదిమూలపు సురేష్, పేర్నినాని వంటి వారు హాజరయ్యే అవకాశం ఉంది.

ఉద్యోగ నేతలపై తీవ్ర ఒత్తిడి ?
ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై నిర్లక్ష్యంగా ఉంటున్నా ఉద్యోగ నేతలు మాత్రం ప్రభుత్వంతో అంటకాగుతున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో ఉద్యోగ నేతలపై కింది స్దాయి ఉద్యోగుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉంది. ఈసారి సమస్యల పరిష్కారం కాకుండా ఉద్యమం విరమిస్తే ఇక అంతే సంగతులు అన్న చర్చ కూడా నడుస్తోంది. దీంతో ఉద్యోగ నేతలు కూడా మంత్రుల కమిటీతో భేటీలో ఆర్ధిక ప్రయోజనాల విషయంలో గట్టి హామీ లభిస్తే తప్ప వెనక్కి తగ్గరాదని భావిస్తున్నారు. అలాగే ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీల అమలుకూ పట్టుబట్టాలని ఉద్యోగ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఉద్యమాలు వాయిదా వేసుకున్న వీరు.. ఈసారి మంత్రుల నుంచి సరైన హామీ లభించకుండా వెనక్కి తగ్గితే మాత్రం కచ్చితంగా ఇబ్బందులు తప్పేలా లేవు. అసలే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగుల నుంచి ప్రభుత్వానికి సహకారం లేదనే వార్తల నేపథ్యంలో ఈ చర్చలు అందరికీ కీలకంగా మారాయి.












Click it and Unblock the Notifications