AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..!
ఏపీలో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఆస్తిపన్ను బకాయిల వసూళ్లపై ప్రభుత్వం దృష్టిసారిస్తోంది. ఇందుకోసం చెల్లింపుదారులకు ఓ ఆఫర్ ఇచ్చింది.
అమరావతి : ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా ఆస్తిపన్ను బకాయిలు ఉన్నవారికి ప్రయోజనం కల్పించేలా ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. దీని ప్రకారం ఇప్పటివరకూ ఆస్తిపన్ను చెల్లించకుండా బకాయి ఉన్న వారికి ప్రయోజనం చేకూరబోతోంది.
ఏపీలో ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో ఆస్తిపన్ను ఇంకా చెల్లించని వారికి ప్రభుత్వం ఓ ఆఫర్ ఇచ్చింది. ఇప్పటివరకూ వారి ఆస్తిపన్నుపై విధించిన వడ్డీని మినహాయిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అంటే వడ్డీ మినహాయించుకుని వాస్తవ ఆస్తిపన్నును వారు చెల్లిస్తే సరిపోతుంది. తద్వారా ఇప్పటివరకూ ఆస్తిపన్ను చెల్లించకుండా వడ్డీ పెనాల్టీ పడిన వారందరికీ ప్రయోజనం చేకూరబోతోంది. ఈ ఆర్ధిక సంవత్సరం మరో రెండు వారాల్లో ముగియనున్న నేపథ్యంలో ఆస్తిపన్ను వసూళ్లు వేగవంతం చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

గతంలోనూ ఆస్తిపన్ను వసూళ్లకు సంబంధించి పలుమార్లు ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయినా ఇంకా చెల్లించని వారు కూడా ఉన్నారు. అలాగే ఇళ్లకు ఆస్తిపన్ను అసెస్ మెంట్ కూడా చేయించుకోకుండా వాటిలో నివసిస్తున్న వారు కూడా ఉన్నారు. వారి నుంచి వసూళ్లు చేపట్టేలా అధికారులకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూనే ఉంది. అలాగే కొత్త ఆర్ధిక సంవత్సరంలో ముందస్తు పన్ను చెల్లించే వారికి కూడా 5 శాతం పన్ను మినహాయింపు కూడా ఇస్తోంది. అయినా ఇంకా చెల్లించకుండా కాలం గడిపేస్తున్న వారు ఉన్నారు. వీరిపై కొరడా ఝళిపించేందుకు అధికారులు జంకుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications