ఏపీలో కొత్త ఉద్యోగాల భర్తీపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం..!
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలన పూర్తి కాబోతోంది. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పలు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశారు. ముఖ్యంగా సచివాలయాల్లో 1.67 వేల ఉద్యోగాలతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల్లోనూ పలు ఉద్యోగాలను భర్తీ చేశారు. తాజాగా గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు కూడా ఇచ్చారు. ఎన్నికల్లోపు ఈ ఖాళీలను కూడా భర్తీ చేసేందుకు పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త ఉద్యోగాల భర్తీపై తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికల సీజన్ వచ్చేసింది. వచ్చే నెలలో సార్వత్రిక ఎన్నికల కోసం షెడ్యూల్ కూడా రాబోతోంది. ఆ తర్వాత మరో రెండు నెలల్లో ఎన్నికలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పూర్తిస్ధాయి బడ్జెట్ ప్రవేపెట్టే పరిస్ధితి లేదు. దీంతో ఓటాన్ అకౌంట్ బడ్డెట్ మాత్రమే ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. దీంతో ఉద్యోగాల భర్తీపైనా ఈ ప్రభావం పడుతోంది. ఈ తరుణంలో ఆర్ధికశాఖ అన్ని ప్రభుత్వ శాఖలకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలో కొత్తగా ఎలాంటి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టవద్దని అన్ని శాఖలకు ఆర్ధిక శాఖ నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఏ ప్రభుత్వ శాఖలో కూడా కొత్త ఉద్యోగాల భర్తీ కోసం తమకు ప్రతిపాదనలు పంపొద్దని ఆయా శాఖలకు సూచించింది. అలాగే ప్రస్తుతం ఉన్న పోస్టుల్లో ప్రమోషన్లు కూడా ఇవ్వొద్దని ఆదేశించింది. అలాగే కొత్త పోస్టుల ఏర్పాటుకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కూడా ఆర్ధికశాఖ సూచించింది. దీంతో ప్రభుత్వ శాఖలు ఇప్పట్లో కొత్త ఉద్యోగాలపై దృష్టిపెట్టే పరిస్ధితి లేదు.
ఇప్పటికే అంగన్ వాడీలతో పాటు సమ్మెలోకి వెళ్లిన పలు ఉద్యోగ సంఘాలకు జీతాలు పెంచలేమని ప్రభుత్వం తేల్చిచెప్పేసింది. ఎన్నికలు జరిగి తిరిగి కొత్త ప్రభుత్వం వచ్చాక జూలైలో జీతాలు పెంచుతామని చెప్పేసింది. అలాగే ఉద్యోగుల క్రమబద్ధీకరణలు, ప్రమోషన్లు, కొత్త ఉద్యోగాల భర్తీ.. ఇలా అన్ని అంశాలపై ఎన్నికల ప్రభావం, ఓటాన్ అకౌంట్ బడ్డెట్ ప్రభావం పడబోతోంది.












Click it and Unblock the Notifications