జగనన్న విద్యాదీవెన మళ్లీ వాయిదా- రూ.700 కోట్ల ఫీజుల కోసం ఎదురుచూపులు..
ఏపీలో జగనన్న విద్యా దీవెన పథకం కింద ఇచ్చే ఫీజు రీయింబర్స్ మెంట్ మొత్తాల విడుదల వరుసగా రెండోసారి వాయిదా పడింది.
ఏపీలో వైసీపీ సర్కార్ గతంలో ఫీజు రీయింబర్స్ మెంట్ పేరుతో ఉన్న పథకాన్ని జగనన్న విద్యాదీవెన పేరుతో మార్చింది. ఈ పథకం కింద ప్రతీ ఏటా విద్యార్ధులు కాలేజీలకు చెల్లించే ఫీజుల్ని తిరిగి వారికి ఈ పథకం కింద తిరిగి చెల్లిస్తున్నారు. అయితే ఈ విద్యా సంవత్సరంలో అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి చెల్లించాల్సిన ఫీజుల్ని ఇప్పటివరకూ చెల్లించలేదు.
ఏపీలో జగనన్న విద్యాదీవెన కింద విద్యార్ధులకు ఇస్తున్న ఫీజుల రీయింబర్స్ మెంట్ మొత్తాల్ని ఈ ఏడాది ఫిబ్రవరి 28కే విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం సంక్షేమ క్యాలెండర్ లో పేర్కొంది. అయితే దాన్ని ఆ తర్వాత వాయిదా వేసి మార్చి 7న ఇస్తామని ప్రకటించింది. ఈ లెక్కన ఇవాళ ప్రభుత్వం విద్యాదీవెన కింద విద్యార్ధులకు ఫీజుల రీయింబర్స్ మెంట్ చేయాల్సి ఉంది. అయితే ఈసారి కూడా ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఈ మేరకు అధికారులకు సమాచారం ఇచ్చారు.

2022-23 విద్యాసంవత్సరంలో జగనన్న విద్యాదీవెన కింద మొత్తం 10.50 లక్షల మందికి రూ.700 కోట్ల ఫీజుల్ని రీయింబర్స్ చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం వరుసగా రెండోసారి దీని చెల్లింపును వాయిదా వేయడంతో విద్యార్దుల్లో, వారి తల్లితండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇవాళ జరగాల్సిన జగనన్న విద్యాదీవెన కార్యక్రమం వాయిదా పడినట్లు సమాచారం పంపిన ప్రభుత్వం.. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తుందన్న దానిపై మాత్రం సమాచారం ఇవ్వలేదు. దీంతో ఈ ఫీజుల కోసం ఎదురుచూస్తున్న వారంతా మరికొంతకాలం వేచిచూడక తప్పేలా లేదు.












Click it and Unblock the Notifications