Usha SriCharan : పేరు మార్చుకున్న ఏపీ మంత్రి-ఉషశ్రీ చరణ్ నుంచి ఉషా శ్రీచరణ్ గా
ఏపీలో వైసీపీ మంత్రిగా ఉన్న ఉషశ్రీ చరణ్ పేరు ఎట్టకేలకు మారింది. అధికారిక పత్రాల్లో, కార్యకలాపాల్లో, శిలాఫలకాల్లో ఇకపై ఆమె కొత్త పేరు దర్శనమివ్వబోతోంది. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన మూడేళ్ల తర్వాత మంత్రి అయిన ఆమె ఇప్పుడు పేరు మార్చుకోరారు. అయితే దీన్ని సీఎంవో కూడా అంత త్వరగా ఆమోదించినట్లు లేదు. దీంతో ఆమె వినతి చేసిన 40 రోజుల తర్వాత ఆమె పేరు మార్చుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

ఉషశ్రీ చరణ్ నుంచి ఉషా శ్రీచరణ్
ఏపీలో వైసీపీ తరఫున తొలిసారి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఉషశ్రీ చరణ్.. మూడేళ్ల తర్వాత మంత్రి కాగలిగారు. జగన్ తాజా కేబినెట్ విస్తరణలో ఆమెకు సామాజిక సమీకరణాల దృష్ట్యా మంత్రి పదవి కేటాయించారు. దీంతో ఆమె ఇప్పుడు మంత్రి హోదాలో ఉన్నారు. అయితే ఆమె ఉషశ్రీ చరణ్ గా ఉన్న తన పేరును ఉషా శ్రీచరణ్ గా మార్చుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు సీఎంవోకు సమాచారం ఇచ్చారు. దీంతో జీఏడీ ఈ విజ్ఞప్తిని ఆమోదించింది.

ఉషాశ్రీ చరణ్ కావడానికి 40 రోజులు
మంత్రి అయిన తర్వాత తన పేరును ఉషశ్రీ చరణ్ నుంచి ఉషా శ్రీచరణ్ గా మార్చాలంటూ ఆమె పెట్టుకున్న వినతిని సాధారణ పరిపాలన శాఖ పరిశీలించి ఆమోదించాల్సి ఉంటుంది. అయితే ఇందుకు మంత్రులు కాబట్టి నాలుగైదు రోజుల్లోనే పరిశీలించి ఆమోదం తెలుపుతారు. కానీ ఉషశ్రీ చరణ్ విషయంలో మాత్రం అది కాస్తా 40 రోజులు తీసుకుంది. వివిధ కారణాలతో ఈ అసాధారణ జాప్యం జరిగినట్లు భావిస్తున్నారు. ఎట్టకేలకు తన పేరు ఉషా శ్రీచరణ్ గా మారడంతో మంత్రిగారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో మోపిదేవి పేరుమార్పు
గతంలో తొలిసారి జగన్ కేబినెట్లో చోటు దక్కించుకున్న మోపిదేవి వెంకటరమణ కూడా పేరుమార్పు కోరారు. తన పేరును మోపిదేవి వెంకటరమణ నుంచి మోపిదేవి వెంకటరమణారావుగా మార్చాలని అడిగారు. దీంతో స్పందించిన జీఏడీ పేరు మార్పు ప్రక్రియ మొదలుపెట్టి ఆయన పేరులో మార్పు చేసి అధికారిక పత్రాల్లో ఈ మేరకు ప్రస్తావించింది. అయితే అప్పట్లో ఇంత జాప్యం చోటు చేసుకోకపోయినా కొంతమేర విమర్శలు వచ్చాయి. అయితే వివాదాలు మాత్రం రాకపోవడంతో ఆ ప్రక్రియ సాఫీగానే పూర్తయిపోయింది. ఇప్పుడు ఉషా శ్రీచరణ్ గా పేరు మార్చడంలో అధికారుల జాప్యం విమర్శలకు తావిచ్చింది.












Click it and Unblock the Notifications