జగన్.. బట్టలూడదీసి నిలబెట్టడానికి ఇదేమైనా ఫ్యాషన్ షోనా!
సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం లోని పాపిరెడ్డి పల్లి లో దారుణ హత్యకు గురైన పార్టీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన జగన్ పోలీసుల పైన తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు మెప్పు కోసం పోలీసులు పని చేస్తున్నారని, అటువంటి పోలీసులను బట్టలూడదీసి ప్రజాక్షేత్రంలో నిలబెడతామని వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
జగన్ వ్యాఖ్యలపై పోలీసులు, హోం మంత్రి ఆగ్రహం
ఇక వైయస్ జగన్ చేసిన వ్యాఖ్యల పైన ఇప్పటికే రామగిరి ఎస్సై సుధాకర్ వీడియోతో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఖాకీ చొక్కా ఊడదీయడానికి అదేమీ అరటి తొక్క కాదంటూ ఆయన వ్యాఖ్యానించారు. జగన్ జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇక మరోవైపు హోం మంత్రి వంగలపూడి అనిత వైయస్ జగన్మోహన్ రెడ్డి పోలీసులపై చేసిన వ్యాఖ్యల పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

జగన్ వ్యాఖ్యలను ఖండించిన పోలీస్ అధికారుల సంఘం
ఖాకీ చొక్కా cmr నుంచి కొనుక్కొచ్చింది కాదని, మాజీ సీఎం నోటికొచ్చింది మాట్లాడటం మంచిది కాదని మండిపడ్డారు. ఇక ఇదే సమయంలో జగన్ చేసిన వ్యాఖ్యలను ఏపీ పోలీస్ అధికారుల సంఘం తప్పు పట్టింది. పోలీసులను బట్టలూడదీసి నిలబెడతామని చెప్పడం దారుణమని పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు జగన్ వ్యాఖ్యల పైన మండిపడ్డారు.
బట్టలూడదీసి నిలబెట్టడానికి ఇదేమైనా ఫ్యాషన్ షోనా?
జగన్ చేసిన తీవ్ర వ్యాఖ్యలను ఆయన ఖండించారు. బట్టలూడదీసి నిలబెట్టడానికి ఇదేమైనా ఫ్యాషన్ షో నా అంటూ ప్రశ్నించారు. జగన్ చేసిన వ్యాఖ్యలపై సభ్యసమాజం ఆలోచించాలని ఆయన సూచించారు. తీవ్ర ఒత్తిడిలో పోలీసులు పనిచేస్తున్నారని అటువంటి పోలీసులపైన జగన్ వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు పేర్కొన్నారు.
జగన్ పోలీసులకు క్షమాపణ చెప్పాలి
జగన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని వెంటనే పోలీసులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ పోలీసులకు క్షమాపణ చెప్పకపోతే న్యాయపోరాటం చేస్తామని తేల్చి చెప్పారు. మొత్తానికి పాపిరెడ్డి పల్లి లో వైసీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్య నేపథ్యంలో చోటు చేసుకున్న హై డ్రామా పైన అటు అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతుంటే, మరోవైపు జగన్ పోలీసులపై చేసిన వ్యాఖ్యల పైన పోలీసుల నుండి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.












Click it and Unblock the Notifications