జగన్‌పై ప్రభుత్వం సీరియస్, ఫ్యామిలీ ఇంతే: వరల్డ్ బ్యాంకుకు మెయిల్స్ కలకలం
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి రుణం ఇవ్వవద్దంటూ వైసిపి ప్రపంచ బ్యాంకుకు లేఖ రాసిందంటూ టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతికి రుణం ఇవ్వవద్దంటూ వైసిపి ప్రపంచ బ్యాంకుకు లేఖ రాసిందంటూ టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రైతుల పేరుతో వైసిపి నేతలు ఫిర్యాదులు పంపారని మంత్రులు యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టిడిపి నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ మండిపడ్డారు.

జగన్ కుటుంబానికి మొదటి నుంచి ఈ దురలవాటు
గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాటి ప్రతిపక్ష నేత వైయస్ రాజశేఖర రెడ్డి కూడా ఇలాగే అనేక కేసులు వేయించారని, ఇప్పుడు అదే దారిలో జగన్ నడుస్తున్నారన్నారు. ప్రతిపక్షంలో ఉంటే అభివృద్ధిని అడ్డుకోవడం జగన్ కుటుంబానికి మొదటి నుంచి ఉన్న దురలవాటే అన్నారు.

రైతుల పేరు మీద..
టిడిపి అధికారంలో ఉంది కాబట్టి ఏపీ నాశనమైనా ఫర్వాలేదని వైసిపి, జగన్ కోరుకుంటున్నారని టిడిపి నేతలు మండిపడ్డారు. అందుకే రాష్ట్రానికి ప్రపంచ బ్యాంకు ఇవ్వాలనుకొంటున్న రూ.4 వేల కోట్ల రుణం రాకుండా చేయడానికి రైతుల పేరు మీద ఫిర్యాదులు పంపుతున్నారన్నారు. ఈ ఫిర్యాదుల వెనుక ఉన్నది వారేనని, రాష్ట్రానికి రుణం రాకుండా అడ్డుకోవడం అనైతికమన్నారు. అరాచకానికి ఇది పరాకాష్ట అన్నారు.

పెట్టుబడులు రాకుండా జగన్ ఇలా రచ్చ
పెట్టుబడిదారుల సమావేశాలు పెట్టినప్పుడు జగన్ విశాఖ విమానాశ్రయంలో నానా రచ్చ చేశారని, జాతీయ మహిళా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు విజయవాడలో అదే తరహా యాగీ చేశారని, విశాఖలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ జరుగుతున్నప్పుడు తునిలో రైలు తగలబెట్టించారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు వెళ్తే తప్పుడు మెయిల్స్ పంపి పెట్టుబడులను అడ్డుకొనే కుట్ర పన్నారని, రాజధాని సభకు రావద్దని విదేశీ మంత్రులకు మెయిల్స్ పంపారని, అమరావతి నిర్మాణం ఆపాలని హరిత ట్రిబ్యునల్‌లో, కోర్టుల్లో కేసులు వేయించారన్నారు.

గెలవకుంటే ఇంత కక్షనా?
ఇప్పుడు ఏకంగా ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదులు పంపారన్నారు. తాము గెలవకపోతే ఇంత కక్ష సాధింపుకు పాల్పడతారా, ఒక రాజకీయ పార్టీగా ఉండటానికే వైసిపికి అర్హత లేదని టిడిపి నేతలు ధ్వజమెత్తారు. ప్రపంచ బ్యాంక్‌కు ఫిర్యాదులు పంపినవారు నిజంగా రైతులే అయితే తమ పేర్లు బయటపెట్టవద్దని కోరరని, రైతుల ముసుగులో వైసిపి దొంగలే ఈ నీచానికి ఒడిగట్టారని ఆరోపించారు. ప్రపంచ బ్యాంకుకు వాస్తవాలు తెలుసుకొని, ఎవరెన్ని చేసినా రుణం వచ్చి తీరుతుందన్నారు. రైతుల పేరుతో ఎవరు లేఖ రాసి ఉంటారో అందరికీ అర్థమవుతోందన్నారు. పట్టిసీమపై కూడా వైసిపి నాయకులు విమర్శలు చేయడం దారుణంగా ఉందన్నారు. అమరావతి నిర్మాణాన్ని అడ్డుకుంటే ఆహుతైపోతారంటూ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ గుంటూరులో ప్రతిపక్షాలపై మండిపడ్డారు.

ప్రభుత్వం సీరియస్
ఇదిలా ఉండగా, మెయిల్స్ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఫిర్యాదులు పంపిన వారిలో రైతులెవరు? రాజకీయ నేతలెవరు? అమరావతిని అడ్డుకునేందుకు చేస్తున్న కుట్రలను బట్టబయలు చేయాలని భావిస్తోంది. ఈ మెయిల్స్ కుట్రంతా వైసిపి నేతలదేనని చెబుతున్న మంత్రులు ఈ వ్యవహారాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్తామని చెబుతున్నారు. అమరావతి నిర్మాణానికి రుణాలు ఇవ్వవద్దని ప్రపంచ బ్యాంకుకు వెళ్లిన ఈ మెయిల్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. రైతుల పేరుతో వైసిపి నేతలే ఈ వ్యవహారాన్ని చేపట్టారని ప్రభుత్వ వర్గాలు గట్టిగా వాదిస్తున్నాయి. రైతులు అయితే తమ పేర్లు బయట పెట్టొద్దని ఎందుకు మెయిల్స్‌లో కోరుతారని ప్రభుత్వ వర్గాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. భూ సమీకరణకు ముందుకు రాని రైతులు బహిరంగంగానే తమ వాదనను వినిపిస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications