జై హనుమాన్.. హనుమాన్ జయంతి నేడు.. తిరుమలలో ఘనంగా ఐదురోజుల వేడుకలు షురూ!!
నేడు హనుమాన్ జయంతి. తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరుపుతున్నారు. జై హనుమాన్ నినాదాలతో హనుమాన్ భక్తులు ఆలయాలలో పూజలు నిర్వహిస్తున్నారు. ఇక నేడు హనుమాన్ జయంతి సందర్భంగా తిరుమలలో విశేష వేడుకలు జరగనున్నాయి. దీనికి టిటిడి అన్ని ఏర్పాట్లు చేసింది.
హనుమాన్ జయంతి.. తిరుమలలో 5 రోజుల వేడుకలు
మొత్తం ఐదు రోజులపాటు జరగనున్న వేడుకలలో తొలిరోజు అంటే నేడు ఆకాశగంగలో శ్రీ బాలాంజనేయ స్వామి, శ్రీ అంజనాదేవికి ప్రత్యేక అభిషేకాన్ని నిర్వహించడంతోపాటు, జపాలి తీర్థంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణానికి ఏర్పాట్లు చేశారు. నేడు ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి 10 గంటల వరకు అభిషేకాన్ని నిర్వహించనున్నారు.

నేడు మల్లెపూలతో హనుమాన్ కు అభిషేకం
ఐదు రోజులపాటు జరిగే హనుమాన్ జయంతి వేడుకలలో తొలిరోజు అయిన నేడు మల్లెపూలతో హనుమాన్ కు అభిషేకం చేయనున్నారు. రేపు తమలపాకులతో, జూన్ మూడవ తేదీన ఎర్రగన్నేరు, కనకాంబరాలతో, జూన్ 4వ తేదీన చామంతితో, చివరి రోజైన జూన్ 5వ తేదీ సింధూరంతో అంజనాద్రి శ్రీ బాలాంజనేయ స్వామి స్వామివారికి అభిషేకం చేస్తారు. ఆంజనేయ సహస్రనామార్చనలతో పాటు అత్యంత ఘనంగా మంత్రోచ్ఛారణల మధ్య ఐదురోజుల హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహిస్తారు.
నేడు జపాలి లో హరికథా గానం
ఇక నేటి నుండి ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ఆకాశగంగ వద్ద శ్రీ ఆంజనేయ జన్మ వృత్తాంతం పై ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇక జపాలి లో ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల మధ్య దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా సామూహిక పారాయణాన్ని నిర్వహిస్తారు. నేడు జపాలి లో హరికథ గానం చేస్తారు. జూన్ రెండవ తేదీన అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులచే సంకీర్తనలు, జూన్ మూడవ తేదీన పురందరదాసు సంకీర్తనలు నిర్వహిస్తారు.
అనేక సంగీత, నృత్య కార్యక్రమాలు
జూన్ 4వ తేదీన హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారిచే భజన కార్యక్రమాలు, జూన్ 5వ తేదీన ప్రాజెక్టు కళాకారులచే హరికథాగానం నిర్వహిస్తారు. ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుండి 5 గంటల మధ్య ఎస్వీ సంగీత నృత్య కళాశాల విద్యార్థులచే నృత్య కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు
హనుమాన్ పై ఆసక్తికర ప్రవచనాలు
అంతే కాదు హనుమాన్ జయంతి సందర్భంగా నాదనీరాజనం వేదికపై ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల మధ్య శ్రీ హనుమాన్ జననం తో పాటు హనుమంతుడికి సంబంధించిన ఇతర ఆసక్తికర విషయాలపై ప్రముఖ వేద పండితులతో ప్రవచన కార్యక్రమం నిర్వహిస్తారు. ఇక హనుమాన్ జయంతి వేడుకలు ఐదు రోజులపాటు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసిన టిటిడి ఆ పనిలో నిమగ్నమైంది.












Click it and Unblock the Notifications