జనసేనలో చేరబోయి..టీడీపీలోకి: చంద్రబాబు భారీ ఆఫర్: జనసైనికులకు నాగబాబు కీలక సూచన
మహాసేన రాజేష్ ఈ నెల 16వ తేదీన తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. తొలుత జనసేనలో జాయిన్ అవుతారనే ప్రచారం జరిగింది. అది సాధ్యపడలేదు. దీనితో ఆయనను ఎవరూ ఏమీ అనొద్దంటూ నాగబాబు సూచించారు.
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. కొద్దిరోజుల బ్రేక్ తరువాత ఆయన మళ్లీ ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని పునరుద్ధరించనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 15, 16, 17 తేదీల్లో ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్లనున్నారు. ఆయన పర్యటనను విజయవంతం చేయడానికి ఆయా జిల్లాల టీడీపీ నాయకులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు.
కాకినాడలోని పార్టీ జిల్లా కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పొలిట్ బ్యురో సభ్యుడు, మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, బండారు సత్యనారాయణమూర్తి, కేఎస్ జవహర్, గొల్లపల్లి సూర్యారావు.. ఇందులో పాల్గొన్నారు. ఇదివరకు కందుకూరు, గుంటూరుల్లో చంద్రబాబు సభల్లో సంభవించిన తొక్కిసలాట వంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలని నిర్ణయించారు.

కాగా- ఈ పర్యటన సందర్భంగా మహాసేన రాజేష్.. తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఈ నెల 16వ తేదీన చేరికకు ముహూర్తం పెట్టుకున్నారు. చంద్రబాబు చేతుల మీదుగా ఆయన టీడీపీ కండువాను కప్పుకోనున్నారు. నిజానికి- ఆయన తొలుత జనసేనలో చేరొచ్చనే ప్రచారం విస్తృతంగా సాగింది. దీనికి ముహూర్తం కూడా ఖరారైందనే వార్తలు వచ్చాయి. మహాసేన రాజేష్ ఈ విషయాన్ని ధృవీకరించారు కూడా. జనసేనలో చేరుతారంటూ జరిగిన ప్రచారాన్ని సమర్థించారు.
ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. జనసేనకు బదులుగా తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులయ్యారు. చంద్రబాబు ఆయనకు భారీ ఆఫర్ ఇవ్వడం వల్లే టీడీపీ వైపు చేరినట్లు చెబుతున్నారు. భవిష్యత్తులో టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకోవచ్చనే అభిప్రాయాన్ని సైతం మహాసేన రాజేష్ వ్యక్తం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జనసేన ఆయనను పార్టీలోకి ఆహ్వానించ లేదనే వాదనలు కూడా ప్రచారంలో ఉన్నాయి.
ఈ పరిణామాల మధ్య జనసేన అధికార ప్రతినిధి, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జన సైనికులకు సూచనలు ఇచ్చారు. మహాసేన రాజేష్ గురించి జన సైనికులు ఎవరూ తప్పుగా మాట్లాడకండి అంటూ ట్వీట్ చేశారు. ఆయన ఏ పార్టీలో చేరాలనుకుంటున్నాడనేది ఆయన ఇష్టమని, అది తన ప్రజాస్వామ్య హక్కు అని స్పష్టం చేశారు. రాజేష్ నిర్ణయం ఎలాంటిదైనా దాన్ని గౌరవించాలని చెప్పారు.












Click it and Unblock the Notifications