జనసేనలో చిచ్చు..పవన్ కల్యాణ్‌కే స్ట్రాంగ్ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ జనసేన పార్టీలో తీవ్ర కలకలం రేపింది. ముఖ్యంగా, శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవికి కొట్టే సాయి ప్రసాద్‌ను ఎంపిక చేయడంపై పార్టీలోని సొంత నాయకులే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఇన్‌ఛార్జి వినూత కోట ఏకంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు బహిరంగ లేఖ రాశారు.
కొట్టే సాయి ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన వినూత కోట, "మహిళలంటే కనీస గౌరవం లేని వ్యక్తికి పవిత్ర పుణ్యక్షేత్రం అయిన శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ పదవి ఇవ్వడం సమంజసం కాదు" అని ప్రశ్నించారు. గతంలో తనపై జరిగిన రాజకీయ కుట్రలో సాయి ప్రసాద్ ఒక కీలక వ్యక్తి అని, ఈ విషయాన్ని పార్టీ కేంద్ర కార్యాలయానికి, పవన్ కళ్యాణ్‌కు, నాదెండ్ల మనోహర్‌కు ఆధారాలతో సహా తెలియజేశానని వినూత కోట తన లేఖలో పేర్కొన్నారు.

తనను రాజకీయాలకు దూరం చేయడానికి కుట్రలు పన్నిన వ్యక్తికి ఇంత పెద్ద పదవి ఇవ్వడంపై ఆమె తీవ్ర అభ్యంతరం తెలిపారు. నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్న అర్హులైన నాయకులు చాలా మంది ఉన్నారని, వారిని గుర్తించి పదవులు ఇవ్వాలని ఆమె పవన్ కళ్యాణ్‌కు విజ్ఞప్తి చేశారు. తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరారు. త్వరలో ఈ వివాదానికి సంబంధించిన అన్ని ఆధారాలను మీడియా ముందు పెడతానని వినూత కోట సంచలన ప్రకటన చేయడంతో, ఈ వ్యవహారం ఇప్పుడు జనసేన పార్టీలో అంతర్గత విభేదాలకు అద్దం పడుతోంది. పవన్ కళ్యాణ్ ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications