350 ఓట్లతో గెలిచిన జనసేన అభ్యర్ధిని.! విజయం చూడక ముందే మృత్యు ఒడిలోకి..!
ఆంధ్రప్రదేశ్ లో తాజాగా జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఇవాళ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. జనసేన తరఫున ఎన్నికల్లో ఎంపీటీసీగా పోటీ చేసిన ఓ అభ్యర్ధిని (JanaSena Candidate) ఇవాళ జరిగిన ఓట్ల లెక్కింపులో 350 ఓట్లతో గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఆ విజయం చూసి సంబర పడేందుకు ఆమె బతికి లేదు. నిన్న హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆమె చనిపోయింది. దీంతో ఇవాళ ఆమె విజయం చూసిన వారంతా కన్నీటి పర్యంతం అవుతున్నారు.
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ధుమంతుని గూడెంలో జనసేన అభ్యర్ధినిగా గారపాటి దివ్య (Garapati Divya) పోటీ చేశారు. 28 ఏళ్ల దివ్య ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తూ రెండు రోజుల క్రితం పోలింగ్ లో ఓటేశారు. అనంతరం ఆమెకు గ్యాస్ట్రిక్ నొప్పి రావడంతో వెంటనే దేవరపల్లిలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ కాస్త కోలుకోవడంతో ఆమెను తిరిగి ఇంటికి తీసుకొచ్చారు.

కానీ నిన్న ఉదయం మళ్లీ తీవ్రమైన నొప్పి రావడంతో దివ్యను మళ్లీ రాజమహేంద్రవరానికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన డాక్టర్లు గుండెపోటుతో మృతిచెందినట్లు నిర్ధారించారు. దీంతో ఆమె స్వగ్రామంలో విషాదఛాయలు నెలకున్నాయి. ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కు ముందురోజే ఇలా జరగడంతో ఆమె బంధువులంతా కన్నీరుమున్నీరవుతున్నారు. అదే సమయంలో ఇవాళ జరిగిన ఓట్ల లెక్కింపులో దివ్య 350 ఓట్ల తేడాతో గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో గెలుపు రుచి చూడకుండానే ఆమె మృత్యుఒడికి చేరుకోవడంపై జనసేన పార్టీ క్యాడర్ తో పాటు ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇందులో ఒకరికి ఐదేళ్లు, మరొకరికి మూడేళ్లు. దివ్య మృతితో పిల్లలు తల్లిలేని వారయ్యారు.














Click it and Unblock the Notifications
