Vangaveeti Radha: వంగవీటి రాధా కోసం ఆ రెండు సీట్లు పరిశీలిస్తున్న జనసేన ..!
ఏపీలో వైసీపీ ఓటమే లక్ష్యంగా జట్టు కట్టిన టీడీపీ, బీజేపీ, జనసేనలో ఇప్పుడు సీట్ల సర్దుబాట్ల వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ పార్టీలో ఉన్న నేత మరో పార్టీలో మారి టికెట్లు తెచ్చుకోవడం, వీటిపై అధిష్టానాల మధ్య ఉన్న అవగాహనను బయటపెడుతోంది. అదే సమయంలో ఇన్నాళ్లూ ఇతర పార్టీల్లో ఉన్న నేతల్ని తమ పార్టీల్లోకి ఆహ్వానించి వ్యూహాత్మక సీట్లను కేటాయించేందుకు కూడా ఆయా పార్టీల అధినేతలు సిద్ధమైపోతున్నారు.
ఇదే క్రమంలో ఇప్పుడు టీడీపీ నేతగా ఉన్న వంగవీటి రాధాను జనసేనలోకి తెచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటికే వంగవీటి రాధా నాదెండ్ల మనోహర్ తో పాటు ఇతర జనసేన నేతలతో భేటీలు అవుతున్నారు. దీంతో ఆయన ఈసారి ఎలాగైనా జనసేన నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారన్న ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో జనసేన పార్టీ వైపు నుంచి కూడా రాధా కోసం ఓ రెండు సీట్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

వంగవీటి రాధా త్వరలో టీడీపీని వీడి జనసేనలోకి వచ్చే అవకాశం ఉండటంతో ఆయన కోసం మచిలీపట్నం లోక్ సభ సీటుతో పాటు దీని పరిధిలోకి వచ్చే అవనిగడ్డ అసెంబ్లీ సీటును కూడా ఆ పార్టీ పరిశీలిస్తోంది. ఇందుకోసం స్ధానికంగా ఉన్న సమీకరణాలను జనసేన నేతలు అంచనా వేసే పనిలో ఉన్నట్లు సమాచారం. మచిలీపట్నం ఎంపీ సీటుతో పాటు అవనిగడ్డ అసెంబ్లీ సీటును కూడా జనసేన పొత్తులో భాగంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు సీట్లలో ఒకటి రాధాకు ఇవ్వాలని ఆ పార్టీ భావిస్తోంది.
అందుకే ఈ మధ్యే పార్టీలో చేరిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి సైతం సిట్టింగ్ స్ధానంలో టికెట్ ఖరారు చేయడం లేదని తెలుస్తోంది. ఒకవేళ రాధా జనసేనలో చేరి ఎంపీగా పోటీకి ఒప్పుకుంటే మచిలీపట్నం నుంచి బరిలోకి దింపాలని, లేదంటే అవనిగడ్డ నుంచి అసెంబ్లీ బరిలో నిలపాలని జనసేన భావిస్తోంది. మరోవైపు అవనిగడ్డ నుంచి తనకు టికెట్ ఇవ్వకపోవడంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఇంకా నిరసనలకు దిగుతూనే ఉన్నారు.












Click it and Unblock the Notifications