స్థానిక ఎన్నికల్లో జనసేన పోటీ సీట్ల పై మనోహర్ కీలక ప్రకటన..!!
ఏపీలో స్థానిక ఎన్నికలకు పార్టీలు సిద్దం అవుతున్నాయి. ప్రభుత్వం ముందుగా మున్సిపల్ ఎన్నిక లు నిర్వహించాలని భావిస్తోంది. ఒకే విడతలో 123 మున్సిపల్ సంస్థలకు ఎన్నికలు నిర్వహించే విధంగా కసరత్తు జరుగుతోంది. కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాల పైన పార్టీ అధినేతలు తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసారు. ఈ సమయంలోనే జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ స్థానిక ఎన్నికల పైన కీలక వ్యాఖ్యలు చేసారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన సమాయత్తం అవుతోంది. 2024 ఎన్నికల ఫార్ములా ఇప్పుడు అమలు కాదని ఇప్పటికే జనసేన ముఖ్య నేతలు స్పష్టం చేసారు. పార్టీ బలం ఉన్న స్థానాల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేసారు. కాగా.. మున్సిపల్ ఎన్నికలు మాత్రమే ప్రస్తుతం జరిగే అవకాశం ఉండటంతో... చంద్రబాబు, పవన్, మాధవ్ కలిసి సీట్ల పంపకాల పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

కాగా.. జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ పార్టీకి కీలక దిశా నిర్దేశం చేసారు. విజయవాడలో పార్టీ కేడర్ సమావేశంలో పాల్గొన్నారు. సాధారణ ఎన్నికలలో రాష్ట్ర హితం కోసం కూటమి ధర్మానికి కట్టుబడి అందరూ కలిసి పని చేశారని చెప్పారు. పవన్ కల్యాణ్ పదవులు కోసం జనసేన ఏర్పాటు చేయలేదని.. యువతను, మహిళలను చైతన్యపరిచేలా జనసేన పార్టీ తొలి అడుగులు వేసిందని చెప్పారు. జనసేన.. ఏనాడు స్వార్ధ రాజకీయాలను ప్రోత్సహించలేదని.. ఆ ఆలోచన కూడా చేయలేదని మంత్రి స్పష్టం చేశారు.
పార్టీ కేడర్ కు దిశా నిర్దేశం
ఇక.. స్థానిక సంస్థల్లో కలిసి పని చేయాలని మనోహర్ సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో పని చేసే వారిని గుర్తించి ప్రోత్సహిస్తామని అన్నారు. స్థానిక సమస్యలపై స్పందిస్తూ ప్రజలకు అండగా ఉండేవారినే గెలిపిస్తారని తెలిపారు. పార్టీలో ఉన్న కార్యకర్తల మాట నాయకులు వినాలని.. ప్రతి నియోజకవర్గంలో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎవరూ నోరు జారకండి, అనవసర రాద్దాంతాలు చేయవద్దని సూచించారు.
జనసేనలో మరో గ్రూపు లేదని... ఎవరైనా పవన్ కల్యాణ్ గ్రూపే అని చెప్పుకొచ్చారు. ఎక్కడ జనసేన సీట్లు తీసుకోవాలి, ఎక్కడ పోటీ చేయాలనేది అధినేత పవన్ కల్యాణ్ అంతిమంగా నిర్ణయిస్తారన్నారు. అన్ని ప్రాంతాల్లో త్వరలోనే పవన్ కల్యాణ్ కమిటీలను ప్రకటిస్తారని స్పష్టం చేసారు.













Click it and Unblock the Notifications