విజయవాడ టీడీపీకి షాకిచ్చిన జనసేన-కార్పోరేషన్ లో గ్రాండ్ ఎంట్రీ..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, రాష్ట్రస్దాయిలో టీడీపీతో కలిసి అధికారం పంచుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో క్షేత్రస్ధాయిలో బలపడేందుకు ప్రయత్నిస్తున్న జనసేన పార్టీ కీలక అడుగు వేసింది. ఇప్పటివరకూ తమకు బలమున్న గోదావరి జిల్లాల్లోనో, లేక విశాఖ వంటి జిల్లాల్లోనో స్థానిక సంస్థల ఎన్నికల్ని గెల్చుకోవడం లేదా చేరికలను ప్రోత్సహించడం చేస్తున్న జనసేన తొలిసారి విజయవాడ కార్పోరేషన్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.
విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ లో వైసీపీకి చెందిన నలుగురు కార్పోరేటర్లు తొలిసారి జనసేన తీర్దం పుచ్చుకున్నారు. ఇప్పటివరకూ విజయవాడ కార్పోరేషన్ లో జనసేన పార్టీకి ప్రాతినిధ్యం లేదు. తొలిసారి వైసీపీ కార్పోరేటర్లు జనసేన పార్టీలో చేరారు. వీరిలో 16వ డివిజన్ కార్పోరేటర్ ఉమ్మిడిశెట్టి రాధిక, 38వ డివిజన్ కార్పోరేటర్ మహదేవ్ అప్పాజీరావు, 48వ డివిజన్ కార్పోరేటర్ అత్తులూరి ఆదిలక్ష్మి, 51వ డివిజన్ కార్పోరేటర్ మరిపిళ్ల రాజేష్ ఉన్నారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది.

తాజాగా జనసేన పార్టీలో చేరిన నలుగురు కార్పోరేటర్లలో ముగ్గురు గతంలో టీడీపీలో చేరిన వారు ఉన్నారు. వారు ఇప్పుడు టీడీపీని కాదని జనసేన పార్టీలో చేరారు. వీరిలో ఆదిలక్ష్మి, రాజేష్, అప్పాజీరావు ఉన్నారు. వీరు కాకుండా ఉమ్మిడిశెట్టి రాధిక నేరుగా వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చారు. ఈ నలుగురు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. దీంతో విజయవాడ కార్పోరేషన్ లో జనసేన బలం నలుగురు కార్పోరేటర్లకు చేరింది.
వాస్తవానికి 64 కార్పోరేటర్ల వీఎంసీలో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి 14, వైసీపీ నుంచి 49 మంది, సీపీఎం నుంచి ఒకరు గెలిచారు. వీరిలో వైసీపీ నుంచి ముగ్గురు టీడీపీలోకి, ఒకరు బీజేపీలో చేరారు. ఇప్పుడు వీరిలో ముగ్గురు జనసేనలో చేరారు. దీంతో వైసీపీ బలం 45కు పడిపోయింది. అయినా కార్పోరేషన్ లో వైసీపీ మెజార్టీ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications