జన్మభూమి ఎక్స్ ప్రెస్ కు కొత్త స్టాప్ ..! గోదావరి జిల్లాలో..!
విశాఖపట్నం-లింగంపల్లి స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించే జన్మభూమి ఎక్స్ ప్రెస్ విషయంలో రైల్వేశాఖ తాజాగా కీలక మార్పులు చేస్తోంది. ఎంతో ప్రయాణికుల ఆదరణ ఉన్న జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైలు సమయాల్ని జనవరి నుంచి మారుస్తున్న రైల్వేశాఖ ఇప్పుడు మరో అదనపు స్టాప్ ను కూడా జోడించింది. అదీ గోదావరి జిల్లాల పరిధిలోనే. ప్రయాణికులు, ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం ప్రతీ రోజూ విశాఖ నుంచి లింగంపల్లికి (12805), లింగంపల్లి నుంచి విశాఖకు (12806) రైళ్లు ప్రయాణిస్తున్నాయి. వీటికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్టాపులతో పాటు అదనంగా జనవరి 6వ తేదీ నుంచి తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తిలోనూ అదనపు స్టాప్ ఇవ్వాలని నిర్ణయించారు. ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. విశాఖ నుంచి లింగంపల్లి వెళ్లే జన్మభూమి ఎక్స్ ప్రెస్ కు జనవరి 6వ తేదీ నుంచి మళ్లీ ప్రకటించే వరకూ ఈ అదనపు స్టాప్ కొనసాగుతుంది. అయితే లింగంపల్లి నుంచి విశాఖ వెళ్లే రైలుకు మాత్రం ఫిబ్రవరి 14 వరకే ఈ స్టాప్ ఇస్తున్నారు.

తాజా మార్పుల ప్రకారం విశాఖ నుంచి లింగంపల్లి వెళ్లే జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైలు అనపర్తి స్టేషన్లో ఉదయం 8.49కి రానుంది. ఒక నిమిషం హాల్ట్ తర్వాత తిరిగి బయలుదేరుతుంది. అలాగే లింగంపల్లి నుంచి విశాఖ వచ్చే జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైలు అనపర్తిలో సాయంత్రం 4.16కు ఆగుతుంది. ఒక నిమిషం హాల్ట్ తర్వాత తిరిగి బయలుదేరుతుంది. అయితే ఫిబ్రవరి 15 నుంచి మాత్రం లింగంపల్లి-విశాఖ జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైలు అనపర్తిలో సాయంత్రం 4.29కు ఆగుతుంది.












Click it and Unblock the Notifications