ఢిల్లీలో చంద్రబాబు ఇక కేరాఫ్ జనపథ్..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో అధికారిక నివాసం మారింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. కేంద్ర బడ్జెట్ వేళ రాష్ట్ర అవసరాల పైన చర్చించారు. ఢిల్లీలో ఈ రోజు నుంచి చంద్రబాబు నూతనంగా కేటాయించిన అధికారిక నివాసంలో అడుగు పెట్టనున్నారు. నేటి నుంచి 1- జన్ పథ్ లో చంద్రబాబు బస చేయనున్నారు. నూతన నివాసంలో పూజల తరువాత చంద్రబాబు అధికారికంగా ప్రవేశించనున్నారు.
కేబినెట్ భేటీ అనంతరం ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు హోం మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. గతంలో ఇతర మంత్రుల ముందు ఉంచిన విన్నపాలనే ఆయన మరోసారి అమిత్ షా కు వివరించినట్టు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక సాయం చేయాలని అమిత్ షా ని కోరినట్టు చంద్రబాబు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పేర్కొన్నారు. విభజన చట్టం అమలు, అమరావతికి సాయం, పోలవరం ప్రాజెక్టుకి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేసారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీ సీఎం నివాసం కోసం కేంద్రం కేటాయించిన 1 జన్‌పథ్ భవనంలోకి ముఖ్యమంత్రి హోదాలో అడుగు పెడుతున్నారు. 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చిన సమయంలో ఈ నివాసాన్ని చంద్రబాబుకు కేంద్రం కేటాయించింది. అప్పట్లో పలు కారణాలతో చంద్రబాబు ఈ నివాసంలో ఉండేందుకు ఆసక్తి చూపించలేదు. 2019లో ముఖ్యమంత్రి అయిన జగన్ ఢిల్లీకి వచ్చిన సమయంలో ఈ అధికారిక నివాసంలోనే ఉండేవారు. ఇప్పుడు చంద్రబాబు తిరిగి ఆ నివాసంలో ఉండేందుకు అంగీకరించారు.
తాజా ఎన్నికల్లో గెలిచిన తరువాత ఢిల్లీ వచ్చిన చంద్రబాబు ప్రతిసారి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నివాసంలోనే బస చేస్తున్నారు. ఇప్పుడు తిరిగి 1 జన్ పథలో చంద్రబాబు కోసం కొన్ని మార్పులు చేసారు. ఈ రోజు పూజల తరువాత చంద్రబాబు అధికారికంగా తన నూతన నివాసంలో అడుగు పెట్టనున్నారు.












Click it and Unblock the Notifications