Pawan Kalyan : తిరుపతిలో ఆ రెండు కులాల మధ్య వైసీపీ చిచ్చు-పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు..
ఏపీలోని రాయలసీమ జిల్లాల్లో వైసీపీ కులాల చిచ్చు పెడుతోందని ఆరోపిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ సంచలన విమర్శలు చేశారు.
తిరుపతి : ఏపీలో వైసీపీ (YSRCP) సాగిస్తున్న కుల రాజకీయాలపై జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇవాళ తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో వైసీపీ కుల రాజకీయాలు ఎలా సాగుతున్నాయో వివరిస్తూ పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రంలో కులాల మధ్య అంతరాలు తగ్గించి...అందరి మధ్య సఖ్యత పెంచేందుకు జనసేన పార్టీ తపిస్తోందని, ఆ దిశగా అడుగులు వేస్తోందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇందుకు భిన్నంగా అధికార వైసీపీ కుయుక్తులు పన్నుతోందని ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి సమాచారం అందుతోందన్నారు. ఈ కుతంత్రాలు తిరుపతి నగరంలో మొదలయ్యాయని, బలిజలు, యాదవుల మధ్య సఖ్యతను విచ్ఛిన్నం చేసేలా కొందరు అధికార పార్టీ వ్యక్తులు చేస్తున్న రెచ్చగొట్టే చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు.

అలాగే ఈ ఉచ్చులో ఎవరూ పడకుండా, ఆ విధమైన కుతంత్రాలకు పాల్పడుతున్నవారిని ఆదిలోనే నిలువరించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు. కులాల మధ్య చిచ్చులు రేపి తమ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని, అందులో భాగంగానే బలిజలకీ, యాదవులకీ మధ్య దూరం పెరిగేలా కుట్రలకు తెర తీశారని వైసీపీ నేతలపై పవన్ విమర్శలు గుప్పించారు. ఆ కులాల్లోనూ వర్గాలు ఏర్పాటు చేసి ఐకమత్యాన్ని దెబ్బ తీసి తాము ఆధిపత్యం చలాయించాలని చూస్తున్నారన్నారు.
ఈ రోజు తిరుపతి కావచ్చు , రేపు మరొక ప్రాంతం కావచ్చు. ప్రజల మధ్య సఖ్యత లేకుండా, భేదభావాలతో ఉండేలా చేయడమే కుట్రదారులు పన్నాగమంటూ పవన్ ఆక్షేపించారు. ఈ తరుణంలో అన్ని కులాలవారూ, ముఖ్యంగా యువతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇలాంటివారికి ప్రజాస్వామ్య పంథాలోనే సమాధానం ఇవ్వాలని సూచించారు. అందరూ ఒక తాటిపైకి వచ్చి ప్రజల మధ్య దూరం పెంచే కుట్రదారుల చర్యలను నిరసించాలని పవన్ కళ్యాణ్ తన ప్రకటనలో కోరారు.












Click it and Unblock the Notifications