అందుకే..ఏకైక రాజధానిగా అమరావతి: తేల్చేసిన జయప్రకాష్ నారాయణ
అమరావతి: రాష్ట్రంలో మరోసారి రాజకీయ వేడిని రగిలించింది అమరావతి ప్రాంత రైతుల పాదయాత్ర. దీనిపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్యుద్ధం సాగుతోంది. పలువురు మంత్రులు, మాజీ మంత్రులు దీనిపై స్పందించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బినామీ ఆస్తులను కాపాడుకోవడానికి తాపత్రయ పడుతున్నారంటూ ధ్వజమెత్తారు. అభివృద్ధి మొత్తాన్నీ అమరావతికే పరిమితం చేయాలనే ఉద్దేశంతోనే వెనక ఉండి రైతుల పాదయాత్రను నడిపిస్తున్నారంటూ విమర్శించారు.

రియల్ ఎస్టేట్ మేనియా..
ఈ పరిణామాలపై జయప్రకాష్ నారాయణ మాట్లాడారు. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం మంచిది కాదని వ్యాఖ్యానించారు. రియల్ ఎస్టేట్ అనే ఓ మేనియాను సృష్టించారని, వేలంవెర్రిగా రేట్లను పెంచి అదే అభివృద్ధి అంటే సరిపోదని అన్నారు. రియల్ ఎస్టేట్ అభివృద్ధిని రాష్ట్రాభివృద్ధిగా చూపిస్తే- వాపును చూసి బలుపుగా భావించినట్టవుతుందని ఎద్దేవా చేశారు. అభివృద్ధి అంతా ఒక్క రాజధాని చుట్టే ఉండాలనుకోవడం దీర్ఘకాలిక ప్రయోజనాలను దెబ్బ తీస్తుందని అన్నారు.

అభివృద్ధి పేరుతో భూములు రేట్లు..
అభివృద్ధి పేరుతో భూమి రేట్లను పెంచే ప్రయత్నం ఇదివరకు అమరావతిలో జరిగిందని గుర్తు చేశారు. భూమిని కొనడానికే అయిదు నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు చేయ్యాల్సిన పరిస్థితి వస్తే.. చిన్న తరహా పరిశ్రమలను నెలకొల్పాలనుకునే పారిశ్రామికవేత్తలు ఇక వాటిని ఎలా నడిపిస్తారని జయప్రకాష్ నారాయణ ప్రశ్నించారు. రాజధాని చుట్టే అన్నీ ఉండాలి.. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులన్నీ ఒకే చోట కూడబెట్టాలనుకునే ఆలోచన ఏ మాత్రం మంచిది కాదని స్పష్టం చేశారు.

వికేంద్రీకరణే బెస్ట్..
అలాంటప్పుడు వికేంద్రీకరణే సరైన నిర్ణయమని అన్నారు. అధికార యంత్రాంగాన్నీ, కోట్ల రూపాయల పెట్టుబడులను రాజధాని పేరుతో ఒకే చోట చేర్చడం రాష్ట్ర ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బ తీస్తుందని స్పష్టం చేశారు. ఇది చాలా ప్రమాదకరమైన విధానమని చెప్పారు. అధికార వికేంద్రీకరణ, ఆర్థిక వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీనికి మూడు రాజధానుల ప్రతిపాదనలు సరైన నిర్ణయంగా భావిస్తున్నానని చెప్పారు.

తీరం ఎక్కడుంటే అక్కడే అభివృద్ధి..
తీరం ఎక్కడ ఉంటే అక్కడే అభివృద్ధి సాధ్యమని, పారిశ్రామికీకరణ అలాంటి చోటే శరవేగంగా అభివృద్ధి చెందుతుందని జయప్రకాష్ నారాయణ అన్నారు. గతంలో అలాంటి పొరపాటు చేయడం వల్లే విభజన తరువాత ఏపీ తీవ్రంగా నష్టపోయిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి చోటు చేసుకుందని, ఫలితంగా మిగిలిన రాష్ట్రాలు వెనుకపడ్డాయని అన్నారు. మళ్లీ అలాంటి పొరపాటే అమరావతి విషయంలో జరగాలనుకోవడం సరైంది కాదని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications