అమెరికా ప్రమాదం: మృత్యువుతో పోరాడి ఓడిన తెలుగు విద్యార్థి జయభరత్
గుంటూరు: అమెరికాలోని టెక్సాస్‌లో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అక్కడి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న గుంటూరు యువకుడు జయభరత్‌రెడ్డి ఆదివారం తుది శ్వాస విడిచాడు. దీంతో అతని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
గుంటూరులోని వెంకటరమణ కాలనీ 3వలైనులో నివసిస్తున్న మారెళ్ల సాంబశివారెడ్డి, సరోజనిదేవి దంపతుల మూడో కుమారుడు జయభరత్‌రెడ్డి (24). అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జయభరత్ రెడ్డి.. తొమ్మిదిరోజుల నుంచి ఆస్పత్రికిలో చికిత్స పొందాడు.
అతడికి రెండు శస్త్రచికిత్సలు చేశారు వైద్యులు. అతని వైద్య ఖర్చుల కోసం పలువురు విద్యార్థులు, తెలుగు ప్రవాసులు ఆర్థిక సహాయం చేయడంతోపాటు చికిత్సకు సహకరించారు. అయినా ఫలితం లేకుండా పోయింది.

జయభరత్‌రెడ్డి మృతితో వెంకటరమణ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిమస్తున్నారు. మృతదేహాన్ని గుంటూరు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు జయభరత్‌రెడ్డి తండ్రి సాంబశివారెడ్డి చెప్పారు.

అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్న భరత్ ఏప్రిల్ 9న రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆ రోజు మధ్యాహ్నం సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమా చూసి కారులో వెళుతుండగా వేగంగా వచ్చిన ఒక ట్రక్ ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం వరకు మృత్యువుతో పోరాడిన భరత్ రెడ్డి.. ఆదివారం తుది శ్వాసవిడిచాడు.












Click it and Unblock the Notifications