మేమెందుకు: మోడీ తీరుపై జెసి సంచలన వ్యాఖ్యలు
అనంతపురం: ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ శానససభ ఎన్నికల్లో బిజెపి ఘోరంగా విఫలమైన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సభ్యులను పట్టించుకోవడం లేదని ఆయన గురువారం మీడియాతో అన్నారు.
40 ఏళ్ల అనుభవం ఉన్న తనలాంటి వాళ్ల సలహాలను కూడా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తన దృష్టిలో చట్ట సభలు వృధాగా మారిపోయాయని ఆయన అన్నారు. కేంద్రం మాట విననప్పుడు పార్లమెంటు సభ్యుల ఎన్నిక ఎందుకని ఆయన అడిగారు. ఎంపిల ఎన్నికలు నిర్వహించడానికి బదులు నేరుగా ప్రధానినే ఎన్నుకోవచ్చు కదా అని ఆయన అన్నారు.

ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ బిజెపి ఊడ్చేసిందని, ఆప్ దెబ్బకు బిజెపి ఊడ్చుకుపోయిందని ఆయన వ్యాఖ్యానించారుప్రజా ప్రతినిధులకు విలువ లేకుండా పోయిందని జెసి అన్నారు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ఇది తాము సాధించామని చెప్పుకోవడానికి పార్లమెంటు సభ్యులుగా తమకేమీ లేదని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యం ఈ దేశానికి పనికి రాదని ఆయన అన్నారు. ఎంపి, ఎమ్మెల్యేల ఎన్నికలు ఈ దేశానికి దండుగ అని ఆయన అన్నారు. దేశానికి ప్రధాని, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటే సరిపోతుందని ఆయన అన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు అవసరం లేదని ఆయన అన్నారు. ప్రధాని, ముఖ్యమంత్రి చెప్పినవే శాసనాలుగా మారిపోతున్నాయని ఆయన అన్నారు.
చంద్రబాబు ఏదైనా మంచి చేస్తే ఇది బాగా చేశావని చెప్పే ప్రతిపక్షాల నాయకులు ఎవరైనా ఉన్నారా అని ఆయన అడిగారు. దేశమంతా ఒక ప్రదానిని, రాష్ట్రాలకు ముఖ్యమంత్రులను ఎన్నుకోండని ఆయన అన్నారు. తెలుగు ఎంపీలను ఢిల్లీలో కరివేపాకులా చూస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు మీద ఏ ఒక్కరికైనా సానుభూతి ఉందా అని ఆయన అడిగారు. చంద్రబాబు మంచి చేస్తున్నారని ప్రజలు అనుకోవడం లేదని ఆయన అన్నారు.
నీటి సమస్యను పరిష్కరించడం చంద్రబాబు ఒక్కరి వల్ల సాధ్యం కాదని ఆయన అన్నారు. నీటిపారుదలను కేంద్రం తన చేతుల్లోకి తీసుకుని నదుల అనుసంధానం చేస్తే పేదరికం పోతుందని జెసి అన్నారు. ఇంత మెజార్టీతో మెజారిటీతో గెలిచాం, ఇది సాధించామని చెప్పడానికి ఏమీ లేకుండా పోయిందని ఆయన అన్నారు. అవినీతి నిర్మూలనపై ప్రధాని మోడీ గతంలో ఇచ్చిన హామీని కూడా ఆయన ప్రస్తావించారు. ప్రజల్లో నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి కోటి సంతకాలతో ఏం ఉద్దరిస్తారని మండిపడ్డారు. అరువు గాంధీలున్నంత వరకు కాంగ్రెస్ బాగుపడదన్నారు.
తెలుగుదేశం పార్టీ బిజెపి మిత్ర పక్షంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జెసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు ఎటు దారి తీస్తాయోననే సంశయం నెలకొంది. అయితే, జెసి దివాకర్ రెడ్డికి మనసులో ఏదీ పెట్టుకోకుండా మాట్లాడడం అలవాటు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గానీ, బిజెపి నాయకులు గానీ జెసి వ్యాఖ్యలను అంత వరకే చూస్తారా, లేదా అనేది తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications