జోగి రమేష్ ఓపెన్ సవాల్! ఆ భూమితో నాకేంటి సంబంధం?
గుంటూరు ఇరిగేషన్ స్థలం కబ్జా చేశానంటూ వచ్చిన ఆరోపణలపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇబ్రహీంపట్నంలోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో పత్రిక ఉందనే నెపంతో తనపై కల్పిత కథనాలు రాయడం తగదని హెచ్చరించారు. ఆ భూమితో తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ, ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణ జరిపించి నిజాలను నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు.
గుంటూరులో రూ.25 కోట్ల విలువైన ఇరిగేషన్ స్థలాన్ని కబ్జా చేసినట్లు ఈ రోజు ప్రముఖ తెలుగు న్యూస్ పేపర్లలో వచ్చిన వార్తలో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని, పత్రిక యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నానని, ఆ స్థలానికి తనకూ ఉన్న సంబంధమేంటో, అందులో ఉన్న ఏజెంట్ ఎవరో నిరూపించాలని సవాల్ విసిరారు. ఉన్న ఒకటి రెండు స్థలాలను కూడా అప్పులు తీర్చడానికి అమ్ముకున్నానని, డబ్బుల కోసం కక్కుర్తి పడి రాజకీయం చేయలేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించి వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

కుటుంబాన్ని టార్గెట్ చేసి వేధిస్తున్నారు!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీసీ నాయకులను టార్గెట్ చేస్తూ వేధింపులకు గురిచేస్తోందని మండిపడ్డారు. ఆధారాలు లేకపోయినా తన కుమారుడు రాజీవ్‌ను భూవివాదం కేసులో జైలుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ మద్యం ఆరోపణలతో తనను, తన తమ్ముడిని 83 రోజుల పాటు అకారణంగా జైల్లో పెట్టారని తెలిపారు. తమ ఇంటిపై హత్యాయత్నం దాడి జరిగిన కేసులో ఎవరినీ అరెస్ట్ చేయలేదని, చివరికి కుటుంబ వ్యక్తిగత జీవితాలను కూడా రాజకీయంలోకి లాగి స్వేచ్ఛను హరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్‌ను సీఎంగా చేసేదాకా పోరాటం ఆపను!
యువజన కాంగ్రెస్ నుంచి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చానని, బడుగు బలహీన వర్గానికి చెందిన నేతనైనందుకే తన కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్ గొంతును బలంగా వినిపిస్తున్నందుకే ఈ కక్ష సాధింపు చర్యలని దుయ్యబట్టారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, జైలుకు పంపినా తన గొంతు నొక్కడం ఎవరి వల్లా కాదని స్పష్టం చేశారు. తనలో ఓపిక ఉన్నంత వరకు వైఎస్సార్సీపీ జెండా పట్టుకుని పోరాడతానని, జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేంత వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.














Click it and Unblock the Notifications