Araku Train: అరకు అందాల రైలుకు తాత్కాలిక బ్రేక్..! ఎప్పటివరకంటే ?
ఏపీలో అరకు (Araku) వెళ్లేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. కానీ విశాఖపట్నం-కిరండోల్ మధ్య నడిచే పాసింజర్ రైలు (Visakhapatnam-Kirandul Passenger) ఎక్కేందుకు మాత్రం జనం పోటీ పడతారు. ఇందులో ఉన్న రెండు విస్టాడోమ్ కోచ్ లకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. వీటిలో టికెట్ 700 రూపాయలకు పైమాటే. ఈ రైలుకూ, అందులో ఉన్న విస్టాడోమ్ కోచ్ లకు ఇంత డిమాండ్ వెనుక కీలక కారణం ఇందులో ప్రయాణిస్తూ అరకు వెళ్తే కనిపించే పర్యాటక అందాలే.
అలాంటి విశాఖ-కిరండోల్ పాసింజర్ రైలు సర్వీస్ ను తాత్కాలికంగా నిలిపేస్తూ తూర్పు కోస్తా రైల్వే నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి మార్చి 14 వరకూ విశాఖ-కిరండోల్ పాసింజర్ ను, అలాగే మార్చి 15 వరకూ కిరండోల్-విశాఖ పాసింజర్ రైలునూ రద్దు చేస్తున్నట్లు తూర్పు కోస్తా రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. వాల్టేరు డివిజన్ లో జరుగుతున్న ఆధునికీకరణ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఈ రైలులో అరకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు నిరాశ తప్పట్లేదు.

విశాఖ-కిరండోల్ పాసింజర్ ఏపీలోని విశాఖ నగరం నుంచి ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని కిరండోల్ మధ్య ప్రతీ రోజూ రాకపోకలు సాగిస్తుంది. ఈ రైలు మొత్తం 430 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అయితే పాసింజర్ కావడంతో ఈ ప్రయాణానికి 13 నుంచి 14 గంటలు పడుతుంది. కానీ అరకు మార్గంలో ఈ రైలు అలా నెమ్మదిగా చేసే ప్రయాణం పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతుంది.

విశాఖపట్నం నుండి ప్రతిరోజూ ఉదయం 7 గంటలకు బయలురే ఈ రైలు కిరండోల్‌కు రాత్రి 8 గంటలకు చేరుతుంది. విశాఖ తర్వాత కొత్తవలస దాటితే అరకు స్టేషన్ వస్తుంది. అరకు వెళ్లే పర్యాటకులు ఇక్కడ దిగిపోతారు. ఈ రైలు అరకు లోయ యొక్క అందమైన ప్రకృతి దృశ్యాలు, సొరంగాలను అత్యంత దగ్గరి నుంచి మనకు చూపిస్తుంది.












Click it and Unblock the Notifications