ఫ్రాన్స్ అధ్యక్షుడు బసచేసిన హోటల్ వద్ద భారీ పేలుడు.. అసలేం జరిగింది..?
సిరియా రాజధాని డమాస్కస్ లో మంగళవారం భారీ పేలుళ్లు సంభవించాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ సిరియా పర్యటనలో భాగంగా ఆ దేశ నూతన అధ్యక్షుడు అహ్మద్ అల్-షరాతో కీలక సమాలోచనలు జరుపుతున్న కొద్దిసేపటికే ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మెక్రాన్ బస చేసిన ఫోర్ సీజన్స్ హోటల్ సమీపంలో జరిగిన ఈ జంట పేలుళ్లలో కనీసం 18 మంది తీవ్రంగా గాయపడినట్లు సిరియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారికంగా ధ్రువీకరించింది.
ప్రమాదం జరిగిన సమయంలో అధ్యక్షుడు మెక్రాన్ అధ్యక్ష భవనంలో సురక్షితంగా ఉన్నారని, ఆయనకు ఎటువంటి ముప్పు వాటిల్లలేదని ఫ్రెంచ్ అధ్యక్ష కార్యాలయం స్పష్టం చేసింది. రెండు దేశాల అధినేతల మధ్య దౌత్యపరమైన చర్చలు యథావిధిగా కొనసాగాయని తెలిపింది. రహదారి పక్కన ఉన్న చెత్తకుండీలో ఒకటి, పార్క్ చేసిన కారులో మరొకటి పేలుడు పదార్థాలు అమర్చినట్లు స్థానిక పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో గాయపడిన వారిలో నలుగురు పోలీసు అధికారులు కూడా ఉన్నట్లు సమాచారం.
సిరియా ఆర్థిక పునర్నిర్మాణమే లక్ష్యంగా చర్చలు
సిరియాలో 2024లో బషర్ అల్-అస్సాద్ నేతృత్వంలోని సుదీర్ఘ ఏకఛత్రాధిపత్య పాలన ముగిసిన తర్వాత అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వంతో భేటీ అయిన తొలి ప్రముఖ పాశ్చాత్య దేశాధినేత మెక్రాన్ కావడం గమనార్హం. 14 ఏళ్లపాటు సాగిన సుదీర్ఘ అంతర్యుద్ధంతో పూర్తిగా దెబ్బతిన్న సిరియాను ఆర్థికంగా ఆదుకోవడానికి, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి మెక్రాన్ ఒక పెద్ద ఆర్థిక ప్రతినిధి బృందంతో కలిసి పర్యటిస్తున్నారు. సిరియాపై ఉన్న పలు అంతర్జాతీయ ఆంక్షలను అమెరికా, యూరప్‌లు తొలగించడంలో ఫ్రాన్స్ కీలక పాత్ర పోషిస్తోంది.
శాంతిభద్రతలను పునరుద్ధరిస్తూ, నూతన ప్రభుత్వ విధానాలపై పాశ్చాత్య దేశాలలో నమ్మకం కలిగించడానికి అధ్యక్షుడు అల్-షరా శ్రమిస్తున్న తరుణంలో ఈ దాడులు జరగడం పెద్ద సవాల్‌గా మారింది. ఒకప్పుడు అల్-ఖైదాతో సంబంధాలు ఉన్న హయాత్ తహ్రీర్ అల్-షామ్ గ్రూప్ నకు నాయకత్వం వహించిన అల్-షరా, ఇప్పుడు దేశాన్ని ప్రజాస్వామ్య మార్గంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. రాజధాని డమాస్కస్ ఇటీవలి కాలంలో ప్రశాంతంగా ఉన్నప్పటికీ, కొన్ని రోజుల క్రితమే ఒక కేఫ్‌లో జరిగిన బాంబు పేలుడులో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.

సుదీర్ఘ యుద్ధం కారణంగా సిరియా మౌలిక సదుపాయాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దేశాన్ని తిరిగి గాడిన పెట్టడానికి వందల బిలియన్ డాలర్ల నిధులు అవసరమైన తరుణంలో, ఫ్రాన్స్‌తో కుదుర్చుకునే ఆర్థిక అవగాహన ఒప్పందాలు సిరియా భవిష్యత్తుకు అత్యంత కీలకంగా మారాయి. ఈ పేలుళ్లకు బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఏ విపక్ష లేదా ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటన విడుదల చేయలేదు. ఈ దాడి వెనుక ఉన్న కుట్ర కోణాలను వెలికితీసేందుకు సిరియా నిఘా వర్గాలు దర్యాప్తును వేగవంతం చేశాయి.












Click it and Unblock the Notifications