ఫైనల్ లో ఇరాన్ ను కబడ్డీ ఆడేసిన భారత్
ఆసియా గేమ్స్ ఫైనల్ లో భారత మహిళల కబడ్డీ జట్టు తడాఖా చూపింది. అద్భుత ప్రదర్శనతో దేశానికి స్వర్ణ పతకాన్ని అందించింది. ఈ ఈవెంట్ లో భారత్ కు ఇది మూడో స్వర్ణం. జపాన్ లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన భారత్.. తన చిరకాల ప్రత్యర్థి ఇరాన్ పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. 37-34 స్కోర్ తేడాతో పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించిన ఈ గేమ్ లో భారత క్రీడాకారిణులు అసాధారణమైన సంకల్ప బలాన్ని ప్రదర్శించారు.
మ్యాచ్ ప్రారంభం నుంచే ఇరు జట్ల మధ్య నరాలు తెగే ఉత్కంఠతో కూడిన పోరు సాగింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి భారత జట్టు పూర్తి వ్యూహాత్మకంగా ఆడి ప్రత్యర్థిపై ఆరు పాయింట్ల ఆధిక్యాన్ని సంపాదించింది. భారత రైడర్లు వరుసగా పాయింట్లు సాధిస్తుండగా, డిఫెండర్లు కూడా విజయవంతంగా పాయింట్లను అడ్డుకున్నారు. అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు ఎప్పుడూ గట్టి సవాల్ విసిరే ఇరాన్.. అంత తేలిగ్గా లొంగిపోలేదు. ద్వితీయార్ధంలో పుంజుకుని భారత క్రీడాకారిణులకు ఊపిరాడనివ్వకుండా చేసింది.

ఆట ముగియడానికి ఎనిమిది నిమిషాల సమయం మాత్రమే ఉందనగా భారత్ డిఫెన్స్‌ను ఛేదించి, ఆలౌట్ సాధించింది.. ఇరాన్. దీంతో ఒకదశలో ఈ రెండు జట్ల మధ్య ఉన్న వ్యత్యాసం ఒకే ఒక్క పాయింట్‌కు తగ్గిపోయింది. మ్యాచ్ ముగియడానికి కూడా ఎంతో సమయం లేదు అప్పటికి. ఎటు తిరుగుతుందో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇరు జట్లు ఒక్కో పాయింట్ కోసం హోరాహోరీగా తలపడటంతో స్టేడియంలోని ప్రేక్షకులు సైతం ఊపిరి బిగబట్టి చూశారు.
ఈ ఒత్తిడి సమయంలో భారత క్రీడాకారిణులు అత్యంత సహనంతో వ్యవహరించారు. ఈ ఆఖరి నిమిషాల క్లిష్ట సమయం నుంచి గట్టెక్కడానికి తమ వ్యూహాన్ని మార్చారు. చివరి అయిదు నిమిషాల్లో ఒత్తిడిని అధిగమించి అద్భుతమైన రైడింగ్‌తో ప్రత్యర్థి డిఫెన్స్‌ను కంగారు పెట్టారు. అదే సమయంలో తమ రక్షణ విభాగాన్ని పటిష్టం చేసుకుని పాయింట్ల ఆధిక్యాన్ని కాపాడుకోగలిగారు. ఫలితంగా స్వర్ణ పతకాన్ని ముద్దాడగలిగారు.
ఆసియా గేమ్స్ చరిత్రలో భారత మహిళల కబడ్డీ జట్టుకు ఇది నాలుగో స్వర్ణ పతకం. ఇదివరకు 2010, 2014, 2022 లల్లో మహిళల కబడ్డీ విభాగంలో ఛాంపియన్ గా నిలిచింది భారత్. ఈ విజయం ఆసియా ఖండంలో కబడ్డీలో భారత్‌ది తిరుగులేని ఆధిపత్యం అని మరోసారి రుజువు చేసింది. స్వర్ణ పతకాన్ని ముద్దాడిన భారత జట్టుపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. పలువురు ప్రముఖులు భారత జట్టుకు అభినందనలు తెలుపుతోన్నారు.












Click it and Unblock the Notifications
