రేపటి నుంచి టీమిండియా వన్డేల జాతర.. !!
భారత పర్యటనకు వచ్చిన వెస్టిండీస్ జట్టుతో మూడు వన్డేల సిరీస్ కోసం టీమిండియా సర్వసన్నద్ధమవుతోంది. మూడు వన్డేలు, అయిదు టీ20 మ్యాచ్ ల టూర్ ఇది. ఈ నెల 27వ తేదీన ఈ సుదీర్ఘ సిరీస్ ఆరంభం కాబోతోంది. మొదటి వన్డే ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో మొదలవుతుంది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌లో శుభారంభం చేయాలని భారత్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆచితూచి తుదిజట్టును ఎంపిక చేయబోతోంది.
ఓపెనర్లుగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు రోహిత్ శర్మ బరిలోకి దిగడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. యశస్వి జైస్వాల్ రూపంలో గట్టి పోటీ ఉన్నప్పటికీ.. ఇటీవల జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ అర్ధ సెంచరీతో అద్భుత ఫామ్‌ను ప్రదర్శించాడు. ఈ ప్రదర్శన కారణంగానే జట్టు యాజమాన్యం అనుభవజ్ఞుడైన రోహిత్‌కే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని చూస్తోంది. దీంతో జైస్వాల్ బెంచ్‌కే పరిమితం కావడం తప్పకపోవచ్చు.

ప్రస్తుతం ఆసియా క్రీడల్లో పాల్గొనడానికి శ్రేయాస్ అయ్యర్ జపాన్ వెళ్లాడు. దీంతో అతని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌కు అవకాశం దక్కింది. ఈ వన్డే సిరీస్‌లో గైక్వాడ్ భారీ స్కోర్లతో తడాఖా చూపితే గనక వన్డే జట్టులో నిలదొక్కుకునే అవకాశం ఉంది. సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మిడిలార్డర్‌కు ప్రధాన బలంగా మారనున్నారు. ఇన్నింగ్స్‌ను తమ భుజస్కందాలపై వేసుకుని నడిపించనున్నారు.
ఆల్ రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ సమస్యల వల్ల ఈ సిరీస్ లో పూర్తిగా బౌలింగ్ చేయలేకపోవడంతో దూరం కావాల్సి వచ్చింది. అతని స్థానంలో యువ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో నితీష్ రాణించాడు. హార్దిక్ పాండ్యాకు సరైన ప్రత్యామ్నాయంగా మారడానికి అతనికి ఇదొక సువర్ణావకాశం లభించింది. దీన్ని ఎలా వినియోగించుకుంటాడనేది ఈ సిరీస్ లో తేలిపోనుంది.
ఆసియా క్రీడల కారణంగా అక్షర్ పటేల్ జట్టుకు అందుబాటులో ఉండట్లేదు. దీంతో సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు తుది జట్టులో చోటు లభించవచ్చు. 2027 వన్డే ప్రపంచ కప్ నాటికి రేసులో తను నిలవాలంటే జడేజా ఈ సిరీస్ లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మెరుగ్గా రాణించాల్సి ఉంటుంది. లేకుంటే అతని స్థానాన్ని అక్షర్ పటేల్ భర్తీ చేయవచ్చు. తుది జట్టులో రెగ్యులర్ అవకాశం దక్కే అవకాశం అక్షర్ పటేల్ కే ఉంది.
స్పిన్నర్ కుల్ దీప్ యాదవ్ ఈ మధ్య అంతగా వికెట్లు తీయలేకపోతోన్నాడు. దీంతో అతని స్థానాన్ని భర్తీ చేయడానికి మరో స్పిన్ బౌలర్ రవి బిష్ణోయ్ సిద్ధంగా ఉన్నాడు. పేస్ విభాగాన్ని మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ముందుండి నడిపించనున్నారు. ఇక తుది జట్టులో చివరి బౌలర్ స్థానం కోసం గుర్నూర్ బ్రార్, ఆఖిబ్ నబీల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది.
భారత తుది జట్టులో.. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్ (కేప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్, కుల్ దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ కు చోటు దక్కొచ్చు.
వెస్టిండీస్ తుదిజట్టలులో.. షై హోప్ (కేప్టెన్ వికెట్ కీపర్), జాన్ క్యాంప్‌బెల్, కీసీ కార్టీ, జ్యువెల్ ఆండ్రూ, షెర్ఫానె రూథర్‌ఫొర్డ్, రోస్టన్ చేజ్, జస్టిన్ గ్రీవ్స్, మాథ్యూ ఫోర్డ్, గుడకేష్ మోటీ, షమార్ జోసెఫ్, అల్జారీ జోసెఫ్.. ఆడొచ్చు.














Click it and Unblock the Notifications
