"సీఈసీకి కనీసం పద్మభూషణ్ అవార్డు ఇవ్వాలిగా..!"- బీజేపీ ఛీఫ్ షాకింగ్ ..!
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ సందర్భంగా తోటి కమిషనర్లను లెక్కచేయకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పై (CEC Gyanesh Kumar) విమర్శల జడివాన కురుస్తోంది. జ్ఞానేష్ కుమార్ తీరుపై మండిపడుతున్న విపక్షాలు.. పార్లమెంట్ లో ఆయనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. విపక్షాలతో పాటు కాక్రోచ్ జనతా పార్టీ సైతం ఇవాళ్టి లోగా సీఈసీ రాజీనామా చేయకపోతే గాంధీ జయంతి నుంచి భారీ ఉద్యమం తప్పదని హెచ్చరించాయి. అయితే అధికార బీజేపీ మాత్రం తాము నియమించిన సీఈసీని వెనకేసుకొస్తోంది.
ఇదే క్రమంలో పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య (Bengal BJP Chief) సీఈసీ జ్ఞానేష్ కుమార్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈసీపై విపక్షాల విమర్శల్ని తప్పుబట్టిన ఆయన.. సీఈసీ పనితీరుపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు భారతదేశపు మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ ఇవ్వాలని సమిక్ ప్రతిపాదించారు. బెంగాల్లో ఆయన హింసారహిత అసెంబ్లీ ఎన్నికలు జరిగేలా చూశారని కితాబిచ్చారు. బంగ్లాదేశ్ చొరబాటుదారుల పేర్లను తొలగించడం ద్వారా ఓటర్ల జాబితాను శుభ్రపరిచారని ప్రశంసించారు.

జ్ఞానేష్ కుమార్ కనీసం పద్మ భూషణ్ పురస్కారానికైనా అర్హులని, చాలా కాలం తర్వాత బెదిరింపులకు తావులేకుండా, ఎన్నికల సమయంలో ఎలాంటి హత్యలు జరగకుండా, ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా పరిస్థితులు ఉండటం పట్ల పశ్చిమ బెంగాల్ ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని సమిక్ భట్టాచార్య తెలిపారు. బెంగాల్‌లోని ఓటర్ల జాబితాలను ప్రక్షాళన చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ వంటి సరిహద్దు రాష్ట్రంలో, ఓటర్ల జాబితా నుండి బంగ్లాదేశ్ చొరబాటుదారుల పేర్లను తొలగించే విషయంలో జ్ఞానేష్ కుమార్ చొరవ తీసుకున్నారన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు ఇలాంటి ఎన్నికలను చాలా అరుదుగా చూశారని, అందుకే అక్కడి ప్రజలు జ్ఞానేష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ, తమ హృదయపూర్వక ఆశీర్వాదాలను అందిస్తున్నారన్నారు.














Click it and Unblock the Notifications
