వారికి ఉచితంగా పంపిణీ చేయండి- చంద్రబాబు ఆదేశాలు..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు.. ఉత్తరాంధ్రలో కొనసాగుతున్న వరద పరిస్థితి పై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష చేసారు. అధికారులు నుంచి సమాచారం సేకరించారు. పలు జిల్లాల్లో నివాస ప్రాంతాలు జలమయం కావడం, పంటల మునగపైన పలు సూచనలు చేసారు. అధికారులు చేపట్టిన సహాయక చర్యల గురించి ఆరా తీసారు. ఇదే సమయంలో బాధితులకు అండగా నిలిచేందుకు చంద్రబాబు మార్గ నిర్దేశం చేసారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో వరద.. ముంపుకు గురైన ప్రాంతాల్లో సహాయక చర్యల పైన సమీక్ష చేసారు. పునరావాస చర్యలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. గత 5 రోజులుగా సముద్రంపై వేటకు వెళ్ల లేకపోయిన మత్సకార కుటుంబాలకు ఉచితంగా 50 కేజీల బియ్యం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరాంధ్రలో నదీ ప్రవాహాలు, ముంపు పరిస్థితిని సీఎం దృష్టికి మంత్రి అచ్చెన్నాయుడు తీసుకొచ్చారు. ఆయా జిల్లాల్లోని రిజర్వాయర్లలో నీటి ప్రవాహాలను ఇరిగేషన్ అధికారులు వివరించారు. హీర మండలం లిఫ్ట్ ప్రాజెక్టుకు విద్యుత్ సౌకర్యం కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇరిగేషన్, విద్యుత్ శాఖల ఉన్నతాధికారులు తక్షణం ఈ ప్రక్రియ పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. లిఫ్ట్ పనులు పూర్తి చేసి వంశధార నీటిని హీర మండలం రిజర్వాయర్లోకి తరలించాలని సూచించారు.

రిజర్వాయర్లలో నీటి నిల్వల పై సూచనలు
అదే విధంగా పలు జిల్లాల్లో రిజర్వాయర్లను నింపేందుకు తీసుకున్న చర్యలపై అధికారులతో సీఎం మాట్లాడారు. కృష్ణానదిలో పైనుంచి ప్రవాహాలు లేవని, స్థానికంగా వస్తున్న వరదతో ప్రకాశం బ్యారేజ్ వద్ద నీళ్లు పెరిగాయని అధికారులు తెలియజేశారు. స్థానికంగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో నిల్వచేసుకునేందుకు పులిచింతల దిగువన, ప్రకాశం బ్యారేజ్‌కు ఎగువన బ్యారేజ్ నిర్మాణం అవసరమని సీఎం తెలిపారు. ప్రకాశం బ్యారేజీకి ఎగువన, దిగువన రెండు బ్యారేజ్‌లు కట్టేందుకు గతంలో చేసిన ప్రతిపాదనలను ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణంపై కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని సీఎం తెలిపారు. తాజా వర్షాలతో వర్షపాతం లోటు 50 నుంచి 31 శాతానికి తగ్గిందని అధికారులు వివరించారు. కోస్తాంధ్రలో 19.80 శాతం లోటు ఉండగా, రాయలసీమలో 42 శాతం లోటు ఉన్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications
