ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నియామకం..!!
ఏపీ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నియమితులయ్యారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో జస్టిస్ ఏవీ శేషసాయిని తాత్కాలిక సీజేగా నియమిస్తూ రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం సీనియర్ న్యాయమూర్తిగా ఏపీ హైకోర్టు పరిపాలన సంబంధ వ్యవహారాలు, న్యాయసేవాధికార సంస్థలో వివిధ హోదాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
జస్టిస్ ఏవీ శేషసాయి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. భీమవరం మున్సిపల్ స్కూల్‌లో ఎలిమెంటరీ విద్యను పూర్తి చేసిన ఆయన ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో బీఎల్ పూర్తి చేశారు. 1987 జులై 3న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. సివిల్, క్రిమినల్, సర్వీసు, రాజ్యాంగ సంబంధ చట్టాలకు సంబంధించిన కేసుల్లో ప్రాక్జీసు చేసి పేరు ప్రఖ్యాతులు గడించారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కు స్టాండింగ్ కౌన్సిల్ గా, బార్ కౌన్సిల్ కు ప్యానల్ న్యాయవాదిగా పని చేసారు.

పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి సుప్రీంకోర్టులో ఒడిసా ప్రభుత్వం వేసిన పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వ న్యాయవాదిగా సేవలు అందించారు. ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా 2013 ఏప్రిల్ 12న ప్రమాణం చేశారు. ఉమ్మడి హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా 2014 సెప్టెంబరు 8న బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి హైకోర్టు విభజన అనంతరం 2019 జనవరి 1న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు. అప్పటి నుంచి సీనియర్ న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్నారు. హైకోర్టు పరిపాలనా సంబంధం వ్యవహారాలు, న్యాయ సేవాధికార సంస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారు.












Click it and Unblock the Notifications