కబాలి నిర్మాత కేపీ చౌదరికి రిమాండ్; కస్టడీకి కోరిన పోలీసులు!!
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పట్టుబడిన డ్రగ్స్ ముఠాలో కబాలి చిత్రనిర్మాత కేపీ చౌదరి ఉండటం టాలీవుడ్ ను షేక్ చేసింది. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసును మళ్ళీ గుర్తు చేసింది. డ్రగ్స్ కేసులో ప్రముఖ నిర్మాత కె.పి చౌదరి అరెస్టయిన నేపథ్యంలో మరోమారు టాలీవుడ్ లో డ్రగ్స్ విక్రయాల పై చర్చ జరిగింది.
ఈ కేసుకు సంబంధించి కబాలి నిర్మాత కేపీ చౌదరిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు చర్లపల్లి సెంట్రల్ జైల్ కి తరలించారు. ఇక మరోవైపున కేపీ చౌదరిని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. కేపీ చౌదరికి చాలామంది సెలబ్రిటీలతో సంబంధాలు ఉన్నాయని డిసిపి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు.

కేపీ చౌదరి సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ దందా చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. డ్రగ్స్ కొనుగోలు చేసి సెలబ్రిటీలకు విక్రయిస్తున్నారని డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు.ఈ క్రమంలోనే ఆయన 90గ్రాముల కొకైన్ ను సెలబ్రిటీలకు విక్రయించడానికి తెచ్చాడని, అతని వద్ద డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న వారి చిట్టా సేకరిస్తామని డిసిపి జగదీశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆయనను మూడురోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోర్టును డిసిపి కోరినట్లు తెలిపారు.
గత కొంతకాలంగా గోవాలో ఉన్న కేపీ చౌదరి ఇటీవల కొకైన్ ను తీసుకొని హైదరాబాద్ కు వచ్చినట్టు పేర్కొన్నారు. డబ్బుల కోసమే కేపీ చౌదరి డ్రగ్స్ అమ్మినట్లు పోలీసులు తెలిపారు. ఆయన ఇప్పటివరకు సినీ పరిశ్రమలో ఎవరెవరికి డ్రగ్స్ విక్రయించారు. ఆయనకు డ్రగ్స్ విషయంలో ఎవరెవరు టచ్ లో ఉన్నారు అన్న కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications