కడప బంద్: గృహ నిర్బంధం, 'రక్తంతో రాసిన లెటర్‌ను డీఎన్‌ఏ టెస్టుకు పంపాం'
కడప: కడపలో నారాయణ కళాశాలలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య ఘటనకు సంబంధించి విచారణ అధికారిగా డీఎస్పీ పూజితను నిమయమించినట్లు డీఐజీ రమణ్ కుమార్ పేర్కొన్నారు. ఇద్దరు విద్యార్థినుల అత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలను బుధవారం మీడియాతో ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. విద్యార్ధినుల మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవని స్పష్టం చేశారు. పోస్టుమార్టం రిపోర్ట్ వస్తేనే అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పారు. విద్యార్థినుల ఆత్మహత్య ఘటనపై విచారణ అధికారిగా ప్రొద్దుటూరు డీఎస్పీ పూజితా నీలం, స్పెషల్ పోలీస్ బెటాలియన్ డీఎస్పీ సుధాకర్ వ్యవహరిస్తారని తెలిపారు.

రక్తంతో రాసిన లెటర్‌ను డీఎన్‌ఏ టెస్టుకు పంపామని, అలాగే విద్యార్థినుల సూసైడ్ నోట్ ను కూడా పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు చెప్పారు. విద్యార్థినుల ఆత్మహత్యకు సంబంధించి సమాచారం ఎవరికైనా తెలిస్తే 9440 796935 ఫోన్ నెంబర్‌కు సమాచారమివ్వాలన్నారు. విద్యార్థినుల ఆత్మహత్య ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు చేస్తామని ఈ సందర్భంగా రమణకుమార్ తెలిపారు.
విద్యార్థినుల ఆత్మహత్య ఘటనకు సంబంధించి విద్యార్థినుల ఫ్రెండ్స్‌తో పాటు రూమ్మేట్స్, అధ్యాపకులు, కళాశాల యాజమాన్యం అందర్నీ విచారిస్తామని ఆయన వివరించారు. ఇది ఇలా ఉంటే కడపలో నారాయణ కళాశాలలో ఇద్దరు విద్యార్ధినుల ఆత్మహత్యకు నిరసనగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుధవారం చేపట్టిన బంద్ ప్రశాంతంగా జరుగుతోంది.
కడప బంద్ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకులను అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మేయర్ సురేష్ బాబు, అంజద్ బాషాను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అలాగే పలువురు పార్టీ నాయకులను అరెస్ట్ చేసి, నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. మరోవైపు కడప వాసులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. బంద్‌కు విద్యార్థి సంఘాలు మద్దతు పలికాయి.
బంద్‌కు మద్దతుగా కడప కోటిరెడ్డి సర్కిల్‌లో బైఠాయించి ఆందోళన చేస్తున్న సీపీఎం రాష్ట్ర కార్యవర్గసభ్యుడు నారాయణ, సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులను పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లవారుజామునే ముఖ్య నేతల ఇళ్ల వద్ద పోలీసులు మోహరించి వారిని బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారు.
మరోవైపు విద్యార్థినుల ఆత్మహత్యకు నిరసనగా కడప బంద్‌కు జిల్లా వ్యాప్తంగా కళాశాలల బంద్ నిర్వహిస్తున్నట్లు వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య తెలిపారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో రిషితేశ్వరి ఘటన మరుకముందే కడపలో నారాయణ కళాశాలలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందటం దారుణమన్నారు.












Click it and Unblock the Notifications