రాచమల్లుకు చెప్పుదెబ్బలు తప్పవు: జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఘాటు హెచ్చరిక
కడప జిల్లా రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ఉద్రిక్తతలు నెలకొని ఉండగా, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేడు ప్రొద్దుటూరులో మీడియాతో మాట్లాడుతూ ఆయన స్పష్టంగా హెచ్చరించారు.రాచమల్లు అతిగా మాట్లాడితే చెప్పు దెబ్బలు తప్పవని ఆదినారాయణ రెడ్డి అన్నారు. ఆయనది దొంగ క్యారెక్టర్ అని, స్థలాల దొంగ అని వ్యాఖ్యానించారు.
ప్రొద్దుటూరులో తమకు చెక్ పెడతామని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. గతంలో తెలుగుదేశం పార్టీ నేత నందం సుబ్బయ్యను హత్య చేయించారని కూడా ఆరోపించారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. కడప జిల్లాలో ఒకప్పుడు ఫ్యాక్షన్లు తీవ్రంగా ఉండేవి. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి మారిందని, అభివృద్ధి మొదలైందని ఆదినారాయణ రెడ్డి అన్నారు.

జిల్లాలో ప్రశాంత వాతావరణం నెలకొని ఉండాలని, రాజకీయ విద్వేషాలు మళ్లీ తలెత్తకూడదని ఆయన సూచించారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సమయంలో కడప జిల్లాలోనూ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇక రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్థానిక ఎన్నికల్లో తీవ్ర అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. టీడీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు.
వారం రోజులుగా దాడులు కొనసాగుతున్నాయని, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డిపై దాడి జరిగినా, మహిళా అభ్యర్థులతో దురుసుగా ప్రవర్తించినా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.జడ్పీటీసీ అభ్యర్థి ఓబయ్య యాదవ్ నామినేషన్ వేసి తిరిగి వస్తుండగా టీడీపీ అభ్యర్థి బచ్చల ప్రతాప్ తమ అభ్యర్థి, ప్రపోజర్‌పై దాడి చేశారని, ప్రపోజర్‌ను కిడ్నాప్ చేశారని రాచమల్లు పేర్కొన్నారు.
పోలీసులు సరైన చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. కొన్ని నామినేషన్లు చెల్లుబాటు కావడంపైనా ప్రశ్నలు లేవనెత్తారు. వైఎస్ జగన్ నాయకత్వంలో న్యాయస్థానంలో పోరాడతానని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ ప్రక్రియ సమయంలో జరుగుతున్న ఈ మాటల యుద్ధం, ఆరోపణలు జిల్లా రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతను సృష్టిస్తున్నాయి.
రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకుంటున్న నేపథ్యంలో ప్రజలు ప్రశాంత వాతావరణం కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛగా, న్యాయంగా జరగాలని సాధారణ ప్రజలు కోరుతున్నారు.కడప జిల్లాలో గతంలో ఫ్యాక్షన్ రాజకీయాలు తీవ్రంగా ఉండేవి. ప్రస్తుతం అభివృద్ధి, ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని అందరూ కోరుతున్నప్పటికీ, ఎన్నికల సమయంలో పాత విద్వేషాలు మళ్లీ తలెత్తుతున్నాయి. రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications
