ఆర్గానిక్ బెల్లంతో కుబేరులైన అన్నాతమ్ముళ్లు
మన దేశంలోని లక్షలాది మంది రైతులు సంప్రదాయ పంటలను నమ్ముకొని తీవ్రంగా ష్టపోతున్నారు. వరి, మొక్కజొన్న, పత్తి పంటలనే కాకుండా... మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న పంటలను పండిస్తే.. అధిక ఆదాయం వస్తోంది. కొత్త విధానంలో సాగు చేయడంతోపాటు వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులను తయారుచేస్తూ... ఎంతో మంది రైతులు లక్షలాది రూపాయలు సంపాదించుకుంటున్నారు.
ఉప్పిన్ సోదరుల శ్రమ : కర్ణాటకలోని కలబురగి జిల్లా అలంద్ తాలుకా గోలాబి గ్రామానికి చెందిన అన్నతమ్ముళ్లు బసవరాజ్ ఉప్పిన్, రేవప్ప ఉప్పిన్ సేంద్రీయ బెల్లం తయారు చేస్తున్నారు. దీనిద్వారా వారు అతి కొద్దికాలంలోనే లక్షాధికారులయ్మారు. తమకున్న 14 ఎకరాల భూమిలో సేంద్రియ పద్ధతిలో సాగు చేసి ఒక్కొక్కరు 20 లక్షల రూపాయలకు పైగా సంపాదించారు. పొలంలో పండించిన చెరుకుతోనే వారు ఆర్గానిక్ బెల్లం తయారుచేస్తున్నారు. మార్కెటింగ్ కూడా వీరే సొంతంగా చేసుకుంటూ అత్యధిక లాభాలను ఆర్జిస్తున్నారు. 14 ఎకరాల్లో 30 క్వింటాళ్ల బెల్లాన్ని ఉత్పత్తి చేస్తున్నారు.

జీవామృతాన్ని ఉపయోగిస్తారు : బెల్లం తయారీలో మంచి ఆదాయాన్ని ఆర్జించడంద్వారా ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. చెరకును పండించేందుకు వీరు ఎటువంటి రసాయనాలను ఉపయోగించరు. ఎకరానికి 10 లీటర్ల జీవామృతాన్ని ఉపయోగిస్తారు. పేడ, ఆవు మూత్రం తప్ప ఇంకేమీ వాడకుండానే చెరకును పండిస్తున్నారు. పొలంలోనే బెల్లం తయారీ యూనిట్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఒక కిలో, 5 కిలోలు, 10 కిలోల బెల్లం ముద్దలను తయారు చేసి.. కిలో రూ.60 చొప్పున విక్రయిస్తున్నారు. ఈ బెల్లం కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఎక్కువగా పొలానికి వెళతారు.

వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు : బెంగుళూరు, హుబ్లీ, ధార్వాడ్, దావణగెరె, బీదర్, బాగల్‌కోట్ వంటి ప్రాంతాలకు కూడా ఈ బెల్లాన్ని పంపిస్తారు. బెల్లం విక్రయం కోసం వీరు వాట్సాప్ గ్రూప్ ను రూపొందించారు. రాష్ట్రంలో బెల్లాన్ని కొనుగోలు చేసే వ్యాపారులను సంప్రదించి మంచి ధర మాట్లాడుకున్న తర్వాత దాన్ని విక్రయిస్తారు. అంతేకాకుండా బెల్లంతోపాటు బెల్లం పొడిని కూడా విక్రయిస్తున్నారు. ఇక్కడ లభించే బెల్లం ఎరుపు రంగులో ఉండటంతోపాటు మంచి సువాసన వెదజల్లుతుంటుంది. రుచి కూడా తియ్యగా ఉంటుంది. పొలానికి వచ్చే వినియోగదారులకు కిలో, 2 కిలోల చొప్పున విక్రయిస్తారు.












Click it and Unblock the Notifications