ఏపీలో వారికి "కలలకు రెక్కలు" పథకం.. పావలా వడ్డీకే రుణాలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి విద్యా వ్యవస్థలో అనేక విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. ఉన్నత విద్యా ప్రమాణాలతో కూడిన విద్యను అందించడమే కాకుండా, బాగా చదువుకోవాలని ఆశ ఉన్న వాళ్లకు అనేక పథకాలను అందిస్తోంది. ఇక నేడు రాష్ట్రవ్యాప్తంగా సాగిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ లో మన్యం జిల్లా బామిని లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు.
విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చెయ్యాలనుకునే వారికి భారీ శుభవార్త
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునే వారికి భారీ శుభవార్త చెప్పారు. ఎవరైతే విదేశాలకు వెళ్లి చదువుకోవాలి అనుకుంటారో వారికోసం కలలకు రెక్కలు అనే పథకాన్ని రూపొందించామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ పథకం కింద పావలా వడ్డీకే రుణాలు అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. విదేశాలకు వెళ్లి చదువుకోవాలని కోరిక ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం కలలకు రెక్కలు అనే పథకాన్ని అందిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు.

పథకం ఉద్దేశం చెప్పిన సీఎం చంద్రబాబు
ముఖ్యంగా యువతకు ఉన్నత విద్య, నైపుణ్య అభివృద్ధి, ఉద్యోగాలు లక్ష్యంగా ఈ పథకాన్ని అందిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. అత్యాధునిక విద్య కోసం ఉపాధ్యాయులకు కూడా నైపుణ్యం పెంపొందించడానికి విదేశాలలో శిక్షణ ఇప్పిస్తున్నాం అని సీఎం చంద్రబాబు తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివారని గుర్తు చేసిన చంద్రబాబు రాష్ట్ర విద్యార్థులు కూడా అదే స్థాయికి ఎదగాలని, అలా వారిని తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.
లోకేష్ కు విద్యాశాఖ బాధ్యతలు అందుకే
ఏపీ విద్యాశాఖకు నూతన ఒరవడి తెస్తానని లోకేష్ సంకల్పించడం వల్లే తనకు విద్యాశాఖ బాధ్యతను అప్పగించాలని సీఎం చంద్రబాబు వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులు వేధింపులకు గురయ్యారని చంద్రబాబు ఆరోపించారు. కూటమి ప్రభుత్వానికి వారిని గౌరవించడం ప్రథమ కర్తవ్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
2026లో స్టూడెంట్ ఇన్నోవేషన్ సమ్మిట్
2026 జనవరిలో విద్యార్థులలో సృజనాత్మకతను ప్రోత్సహించే విధంగా స్టూడెంట్ ఇన్నోవేషన్ సమ్మిట్ ను నిర్వహిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఈ సదస్సు యువ ఆవిష్కర్తలకు కొత్త అవకాశాలను కల్పిస్తుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రతిభావంతులను ప్రోత్సహించటం కోసం షైనింగ్ స్టార్స్ కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు .












Click it and Unblock the Notifications