బడ్జెట్‌పై కవిత అసంతృప్తి, కేజ్రీవాల్ పార్టీపై కోపాన్ని చూపించొద్దని..
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ పైన తెలంగాణ రాష్ట్ర సమితి నేత, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌తో సామాన్యుడికి మేలు జరగదన్నారు. వృద్ధి రేటులో చైనాతో భారత్ పోటీ పడుతోందన్నారు. ఇంకా విదేశీ పెట్టుబడులపై ఆధారపడటం సరికాదన్నారు. 2022 నాటికల్లా ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తామని కేంద్రం చెబుతోందని, ఇందిరా ఆవాస్ యోజన పథకానికి మాత్రం కేటాయింపులు తగ్గించిందన్నారు.
కేంద్ర బడ్జెట్‌లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు 55 శాతం, మధ్యాహ్న భోజన పథకానికి 50 శాతం నిధులు తక్కువగా కేటాయించారన్నారు. రైతు రుణాల కోసం మరో రూ.50వేల కోట్లు కేటాయించవలసి ఉండెనని చెప్పారు. ఆరోగ్య రంగానికి 1.32 నుండి 1 శాతానికి నిధులు తగ్గించారని చెప్పారు. అందుకే ఈ బడ్జెట్ పేదల, మహిళల, రైతుల వ్యతిరేక బడ్జెట్ అన్నారు. ఇది కార్పోరేట్ అనుకూల బడ్జెట్ అని ఆరోపించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వచ్చినందున బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీ పైన కోపం ఉండవచ్చునని, కానీ మీరు ఆ కోపాన్ని సామాన్యుల మీద కూడా చూపిస్తున్నారని కేంద్రం పైన మండిపడ్డారు. దయచేసి అలా చేయవద్దని ఆమె కోరారు.

తెరాసలోకి చిన్నపరెడ్డి
తెరాసలోకి వలసల పర్వం కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ నేత తేరా చిన్నప రెడ్డి సోమవారం నాడు తెరాస తీర్థం పుచ్చుకున్నారు. మంత్రులు మహేందర్ రెడ్డి, హరీష్ రావుల సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు.
టీడీపీ అంటే తెరాసకు భయం: ప్రభాకర్ రెడ్డి
టీడీపీ అంటే తెరాస ప్రభుత్వం భయపడుతోందని ఆ పార్టీ నేత ప్రభాకర్ రెడ్డి అన్నారు. అందుకే తెలంగాణ అభివృద్ధిని తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటోందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. మండలి ఎన్నికలు తెరాస ప్రభుత్వానికి రెఫరెండం కావాలన్నారు. ఇప్పటికీ ప్రభుత్వం తెలంగాణ సెంటిమెంట్‌ని ఆయుధంగా చేసుకుని ప్రజల్లోకి వెళుతోందన్నారు.












Click it and Unblock the Notifications